చెత్త సేకరణ కోసం కర్ణాటక సర్కారు ప్రారంభించిన (Karnataka garbage disposal) శిక్షణా కార్యక్రమంలో చదువుకున్న మహిళలే ఎక్కువగా పాల్గొంటున్నారు. డిగ్రీలు, డబుల్ డిగ్రీలు చేసినవారు కూడా ఇందుకు ఎంపికయ్యారు.
రాష్ట్రంలోని హావేరి జిల్లాలో 32 మంది మహిళలను ఎంపిక చేసింది అధికార యంత్రాంగం. వీరికి శిక్షణ కూడా పూర్తి చేసింది. మొత్తం 32 మంది మహిళల్లో ముగ్గురు డిగ్రీ పూర్తి చేసినవారు ఉండగా.. ఒక మహిళ డబుల్ డిగ్రీ చేసింది. ఆరుగురు మహిళలు సెకండరీ విద్య పూర్తి చేశారు. 19 మంది మహిళలు 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక 7వ తరగతి చదివిన వారు ముగ్గురు ఉన్నారు.

గ్రామాల్లో విధులు
వీరందరికీ చెత్త సేకరణ వాహనాలను (Waste disposal vehicle) అందించనుంది కర్ణాటక ప్రభుత్వం. గ్రామ పంచాయతీ స్థాయిలో వీరంతా విధులు నిర్వర్తించనున్నారు.
"నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఈ పథకానికి మా గ్రామ పంచాయతీ, జిల్లా పంచాయతీ అధికారులు నన్ను ఎంపిక చేశారు. దేవగిరిలో శిక్షణ తీసుకున్నాం. ఇకపై గ్రామంలో పనిచేస్తాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అనుకుంటున్నాం."
-కవిత, శిక్షణ పొందిన మహిళ
మహిళా సంఘం సభ్యులే

మహిళా సంఘాల నుంచే అభ్యర్థులను ఎంపిక చేశారు అధికారులు. శిక్షణ పొందినవారంతా సంజీవనీ గ్రామ పంచాయతీ మహిళా సంఘం సభ్యులేనని తెలిపారు. ఈ సంఘంలోని మిగతా సభ్యులకూ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ పథకాన్ని 170 గ్రామ పంచాయతీలకు విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి 109 టిప్పర్ ట్రక్కులను జిల్లాకు అందించింది.

ఎంపికైన మహిళలకు దేవగిరికి చెందిన రూడ్సెట్ ఇన్స్టిట్యూట్ డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి లైసెన్సులు ఇస్తోంది.
ఇదీ చదవండి: 16 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్.. 'పరీక్ష'లో కాపీ కొట్టకూడదని...