ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను తుపాకీతో కాల్చి చంపిన నిందితులు అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. హంతకులు తుర్కియేకు చెందిన టిసాస్ కంపెనీ తయారుచేసిన సెమీ- ఆటోమేటిక్ జిగాన పిస్తోళ్లు వాడినట్లు సమాచారం. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటి 6లక్షల రూపాయలకుపైగా ఉంటుంది. తుర్కియే సైన్యం, ప్రత్యేకదళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వాటినే వాడుతున్నాయి. అయితే భారత్‌లో వాటిపై నిషేధం ఉన్నప్పటికీ.. నిందితులకు ఆ తుపాకులు ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి తుర్కియే తుపాకులను తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుర్కియే తుపాకులకు పాక్ నకళ్లను తయారు చేస్తోంది. అవి అసలు తుపాకులంత నాణ్యతతో ఉన్నా.. ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాక్‌లో గన్‌వ్యాలీగా పేరున్న దర్రా ఆదమ్ ఖేల్ అనే ప్రాంతంలో దాదాపు రెండు వేల ఆయుధ షాపులు ఉన్నాయి. అక్కడి నుంచే నిందితులకు ఆయుధాలు అందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఆయుధ నిపుణులకు మాత్రమే తెలిసే ఇటువంటి తుపాకులు అతీక్ సోదరుల హంతకులు వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
అతీక్ సోదరులను హత్య చేసిన హంతకుల్లో ఒకడైన సన్నీకి పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సుందర్ భాటితో సంబంధాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు వాడిన జిగాన తుపాకులు సుందర్ నుంచే సన్నీకి చేరినట్లు అనుమానిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం సన్నీ, సుందర్ హమీర్‌పుర్ జైల్లో కలుసుకొన్నారు. అక్కడే వారికి పరిచయం పెరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్నీ.. భాటి మనుషులతో టచ్‌లో ఉన్నాడు. అయితే భాటికి, అతీక్ అహ్మద్‌కు పాత కక్షలు ఉన్నట్లు బయటపడలేదు.
ప్రతాప్‌గఢ్ జైలుకు నిందితులు..
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను హత్య చేసిన నిందితులను నైనీ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలతోనే లవ్లీశ్ తివారీ, సన్నీసింగ్, అరుణ్ మౌర్యను వేరే జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నైనీ జైలులో నిందితులపై దాడి జరిగినట్లు సమాచారం. వారిని అక్కడే ఉంచితే మరింత ప్రమాదమని భావించిన జైలు అధికారులు.. ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.
అతీక్ అహ్మద్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు..
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ పోస్టుమార్టం పరీక్షల నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అతీక్ తలకు ఒక బుల్లెట్ తగలగా.. ఛాతి, శరీరం వెనుక భాగంలో కలిపి మరో 8 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతీక్ సోదరుడు అష్రఫ్ శరీరం నుంచి 5 బుల్లెట్లను వైద్యులు తీసినట్లు సమాచారం. నిందితులు పేరు కోసమే కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నప్పటికీ.. ఘటన వెనక మరో కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతీక్ సోదరుల హత్యపై యూపీ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.