Gangrape Latest News: స్కూల్ టీచర్లు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ ఐదుగురు బాలికలు పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు ప్రిన్సిపల్ సహా 15 మంది టీచర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
ఫిర్యాదుపై సందేహాలు..
ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికలు ఇచ్చిన ఫిర్యాదుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
"ఇది.. ఈ స్కూల్లో పనిచేసిన మాజీ ఉపాధ్యాయుడు చేపట్టిన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. అత్యాచారానికి గురయ్యామని పేర్కొంటున్న బాలికలకు పరీక్షలు నిర్వహించేందుకు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. ప్రిన్సిపల్ సహా మొత్తం స్కూల్ స్టాఫ్పైన స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేశాం. మహిళా ఉపాధ్యాయుల సాయంతో టీచర్లు తమపై అత్యాచారానికి పాల్పడేవారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతాం."
-రామ్మూర్తి జోషి, ఎస్పీ
ప్రతీకార చర్య!
గతేడాది డిసెంబరులో ఈ పాఠశాలకు చెందిన ఓ టీచర్.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగా అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో ప్రస్తుతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఆ టీచర్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌లో ఉన్న నిందితుడు స్కూల్స్టాఫ్పై ప్రతీకార చర్యగా ఇందంతా చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం అవుతోందంటున్నారు పోలీసులు.
11 ఏళ్ల బాలికపై అత్యాచారం
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఓ 11 ఏళ్ల బాలిక ఈనెల 2న బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు.
'బాధితురాలి బంధువు, నిందితుడు గుజరాత్లో కలిసి పనిచేసే వారు. గతేడాది లాక్డౌన్ సమయంలో నిందితుడు బాధితురాలి ఇంటికి వచ్చాడు. అప్పటినుంచి అక్కడే ఉంటూ బాలికపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు' అని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...