Ganga waters turn black: పవిత్ర గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వద్ద నదీ జలాలు నల్లగా మారిపోయాయి. మురుగునీరు నదిలోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

River Ganga pollution
గత కొద్ది రోజుల నుంచి నదీ జలాలు నల్లగా కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. కాశీలోని మణికర్ణిక ఘాట్, గంగా మహాల్ ఘాట్, మీర్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్లలో నదీ జలాలు.. స్నానానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాటర్ కార్పొరేషన్ స్పందించింది. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది.

మురుగు నీటి పంపులు దెబ్బ తిని...
విశ్వనాథ్ ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరిగిన సమయంలో.. మురుగునీటి పంపులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మురుగునీరు గంగానదిలో కలిసిపోతున్నాయని చెప్పారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోందని పేర్కొన్నారు.

అయితే, కాలుష్య నియంత్రణ విభాగ అధికారి ఎస్కే రాజన్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మురుగునీటి పంపునకు, నది కాలుష్యానికి సంబంధం లేదని చెప్పారు. సాంకేతిక కమిటీ నీటి నమూనాలు సేకరించి పరిశీలన చేపట్టిందని వెల్లడించారు. 'ఏవైనా సాంకేతిక కారణాల వల్ల నీరు నల్లగా మారిపోయి ఉండొచ్చు. పరిశీలన జరిపిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది' అని అన్నారు.

గంగా నదిలో నీరు నల్లగా మారిపోవడం వల్ల అక్కడికి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నదీస్నానాలు చేయడానికి నీరు అనుకూలంగా లేవని స్థానిక పూజారి చెప్పారు.
ఇదీ చదవండి: ఎకనామిక్స్‌లో మాస్టర్స్.. హత్యలు చేసి ఆన్లైన్ ట్రేడింగ్