గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. గల్వాన్ ఘటనలో అమరులైన జవానులకు మరణాంతర సైనిక పురస్కారాలు అందించనుంది కేంద్రం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
కర్నల్ సంతోష్ బాబు సహా.. గల్వాన్ ఘటనలో చైనాను తిప్పికోట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన జవానులను.. మరణాంతరం ఇచ్చే గ్యాలెంటరీ పురస్కారాలతో గౌరవించనుంది ప్రభుత్వం.
అమరులను ప్రముఖ 'చక్ర' పురస్కారాలతో కేంద్రం గౌరవించనుంది. వీటిలో పరమవీరచక్ర, వీర్ చక్ర, మహవీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఉన్నాయి.
గతేడాది జూన్ 15న జరిగిన ఈ ఘటనలో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు లద్దాఖ్‌లోని పోస్ట్ 120 ప్రాంతంలో గ్యాలెంట్స్ ఆఫ్ గల్వాన్ పేరుతో సైన్యం ఇప్పటికే స్మారకాన్ని నిర్మించింది. సైనిక వ్యవహారాల శాఖ కూడా దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌లో ఈ సైనికుల పేర్లు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆరోజు ఏం జరిగిందంటే..
సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న వేళ.. గల్వాన్‌లోని పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమ కట్టడాలను వ్యతిరేకించిన భారత సైనికులపై చైనా దాడి చేసింది. రాళ్లు, ముళ్లకర్రలు, ఇనప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారు. ఈ క్రమంలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన నివేదికలో 35 మంది చైనా సైనికులు మృతి చెందారని పేర్కొంది.
ఇదీ చదవండి : 'మీరు పరిష్కరిస్తారా? చట్టాలపై మేము స్టే విధించాలా?'