Gadwal Politics in Telangana Assembly Elections : గద్వాల పేరు చెబితే టక్కున గుర్తొచ్చేది సంస్థానం. అప్పటి కోట. చేనేత రంగం. రాజకీయంగా గద్వాల పేరు చెప్తే గుర్తొచ్చేది మాత్రం డీకే కుటుంబం. బంగ్లా పాలన. 1957 నుంచి ఇప్పటివరకూ డీకే కుటుంబం(DK Family) పోటీ చేయని ఎన్నికల్ని అక్కడి ఓటర్లు చూడలేదు. మొదటిసారిగా డీకే కుటుంబం పోటీ చేయకుండా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు ఇవే కావడం విశేషం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనం దృష్టి.. ప్రస్తుతం గద్వాలపై పడింది. బీసీవాదం బలపడిన నేపథ్యంలో.. వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు డీకే అరుణ ప్రకటించడం సంచలనం రేపింది.
గతంలో నన్ను బాధ పెట్టారు - ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్
Election Campaign in Gadwal : గద్వాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినే బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నిలిపింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీని.. అందునా మహిళను బరిలో దిపింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సరిత.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. గద్వాలలో బీసీ ఓటు బ్యాంకు(BC Vote Bank) ఎక్కువ. కురవ, వాల్మీకి బోయ సహా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఏళ్లకు ఏళ్లుగా డీకే సత్యారెడ్డి, పాగ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు మినహా.. మిగిలిన వారికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు.
1999లో గట్టుభీముడు డీకే అరుణపై విజయం సాధించి.. బంగ్లాపాలనకు అట్టుకట్ట వేశారు. కాంగ్రెస్ వ్యూహంతో ఇప్పుడు బీసీ నినాదం ఊపందుకుంది. ప్రత్యర్థులే అయినా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. డీకే అరుణ మేనల్లుడు. ఆ కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకువెళ్తోంది. బీసీవాదం బలపడటంతో డీకే అరుణ(DK Aruna) కుటుంబం సైతం వ్యూహాత్మకంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా బరిలో దించింది. దీంతో వాల్మీకీల ఓట్లు చీలుతాయని భావించిన కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించింది.
అభయహస్తం పేరిట - 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
BC Motto in Gadwal Assembly Election : బీసీ సామాజిక వర్గానికే చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్... ఆలిండియా ఫార్వార్డ బ్లాక్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ బీఎల్ఎఫ్ తరపున పోటీ చేసి సత్తా చాటారు. అతని ప్రభావం సైతం బీసీ ఓటు బ్యాంకుపై ఉంటుంది. గద్వాలలో పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు.. బీఆర్ఎస్ అభ్యర్ధి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సానుకూల అంశాలు కాగా.. సర్కారుపై వ్యతిరేకత, బీసీ నినాదం ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉంది.
బీసీ మహిళ కావడం, జడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేసిన పనులు.. కాంగ్రెస్ అభ్యర్థి సరితకు సానుకూలంగా ఉన్నాయి. ఆమె స్థానికురాలు కాదనే అంశాన్ని.. విపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. డీకే కుటంబ మద్దతు బీజేపీ అభ్యర్ధి శివారెడ్డికి సానుకూల అంశం కాగా... బలమైన ప్రత్యర్ధులు ప్రతికూలం కానున్నారు. నియోజకవర్గంలో 2 లక్షల 56వేల మంది ఓటర్లున్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారంకాని సమస్యలు చాలానే ఉన్నాయి.
ఎన్నికల్లో ఓట్లు పొందాలనే ఉద్దేశం తప్ప - కాంగ్రెస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు - కిషన్ రెడ్డి
Telangana Assembly Elections 2023 : దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత, నెట్టెంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లు, గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి, గుర్రంగడ్డ వంతెన నిర్మాణం, చేనేత పార్కు ఏర్పాటు, పర్యాటక కేంద్రంగా జూరాల, ఉన్నత విద్యాసంస్థల మంజూరు, మౌలిక వసతుల కల్పన లాంటి అంశాలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి ప్రభావం ఓటింగ్‌పై పడే అవకాశం ఉంది.
ఏపార్టీ ఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుందో జనం అటువైపు మళ్లే అవకాశం ఉంది. పదేళ్ల బీఆర్ఎస్(BRS Party) సర్కారు ప్రగతికి గద్వాల ప్రజలు తిరిగి పట్టం కడతారా...? మహిళ, బీసీ అనే నినాదంలో ముందుకు వెళ్తున్న సరితకు జై కొడతారా...? మళ్లీ అదే డీకే కుటుంబం బలపరిచిన అభ్యర్థి శివారెడ్డిని గెలిపించి బీజేపీకు అవకాశం ఇస్తారా..? వేచి చూడాల్సిందే.