Funeral Inside House Compound: కర్ణాటక, బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కుటుంబం.. తమ ఇంట్లోని ప్రహారీగోడ వద్దే కుటుంబసభ్యురాలి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమైందంటే..?
పుత్తెనహళ్లిలోని పాండురంగానగర్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అందులో ఒకరైన 80ఏళ్ల వృద్ధురాలు మృతిచెందగా.. ఇంటి ప్రహారీగోడ వద్దే అంత్యక్రియలు చేశారు కుటుంబసభ్యులు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే ఈ చర్యపై స్థానికులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టూ ఇళ్లు, అపార్ట్మెంట్లు, చిన్నపిల్లలు ఆడుకునే చోట ఇలా చేయడం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మృతదేహాన్ని వేరేచోట పూడ్చాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులపై రాళ్లు రువ్వారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నివాస ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చరాదని పోలీసులు కుటుంబసభ్యులకు చెప్పారు. సొంత స్థలమైనా స్థానికుల అనుమతి లేనిదే ఇలాంటివి చేయరాదన్నారు.
ఇదీ చూడండి: అక్రమ సంబంధానికి యువకుడు బలి- 150 అడుగుల లోతులో శవం- 7 రోజులు తవ్వితే..