'కృషితో నాస్తి దుర్భిక్షం' అనే నానుడిని నిజం చేసి చూపింది కేరళ తిరువనంతపురానికి చెందిన అని శివ. కష్టాల కడలిని దాటి పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సాధించింది. రోడ్డు పక్కన నిమ్మరసం అమ్మే స్థాయి.. నుంచి ఎస్సై ఉద్యోగం సాధించేంత వరకు ఆమె విజయ గాథ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఆమె విజయ గాథ.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
చిన్నవయసులోనే వివాహం
డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తల్లిదండ్రులను కాదని తన ప్రేమ వివాహం చేసుకుంది అని. పెళ్లైన రెండేళ్లకే మనస్పర్థలు వచ్చి ఇద్దరు విడిపోయారు. తమ మాట వినకుండా వెళ్లినందుకు తల్లిదండ్రులు ఇంటికి రావొద్దన్నారు. దీంతో 8నెలల బిడ్డతో రోడ్డున పడింది అని.
నిమ్మరసం, ఐస్క్రీమ్లు అమ్ముతూ..
దిక్కుతోచని స్థితిలో ఉన్న అనిని.. తన అమ్మమ్మ చేరదీసింది. అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ.. పూట గడిచేందుకు రోడ్డు వెంట నిమ్మరసం, ఐస్క్రీమ్లు అమ్మింది. ఇంటింటికీ తిరుగుతూ కర్రీ పౌడర్ విక్రయించింది. అడుగడునా కష్టాలు.. ఏదో సాధించాలన్న తపనతో.. ఆర్థిక సమస్యల నడుమ డిగ్రీ పూర్తిచేసింది.
రోజుకు 20 గంటలు..
2014 లో తిరువనంతపురంలోని ఓ కోచింగ్ సెంటర్లో ఎస్సై కోచింగ్ తీసుకుంది అని. రోజుకు 20 గంటలు నిర్విరామంగా శ్రమించింది. 2016లో మహిళా పోలీస్ విభాగంలో సివిల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైంది. ఆ తర్వాత 2019లో ఎస్సై పోస్టు సాధించింది.
శిక్షణ అనంతరం.. 2021, జూన్ 25 నుంచి వర్కాలా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది అని.
ఇదీ చదవండి : 12 మామిడి పండ్లకు రూ.1.2లక్షలు- బాలిక కల సాకారం