పంజాబ్‌లో మహిళలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. పంజాబ్ ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ(పంజాబ్ రోడ్‌వేస్) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఇందుకోసం నూతన పథకాన్ని ప్రవేశపెడతామని మార్చి 5న అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు నడిపించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ గురువారం నుంచి.. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: 'మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండండి'
ఆ బస్సులకు వర్తించదు..
అయితే.. ప్రభుత్వ ఏసీ, వోల్వోతో పాటు ఇతర లగ్జరీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టంచేసింది. ఉచితంగా ప్రయాణించే మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా ఉన్న గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం మహిళలకు లబ్ధి చేకూర్చడమే కాకుండా రాష్ట్రంలో మహిళా భద్రతకు ఎంతో దోహదం చేస్తుందని అమరీందర్ సర్కార్ అభిప్రాయపడింది.
1.31 కోట్ల మందికి లబ్ధి..
ప్రభుత్వ నిర్ణయంతో పంజాబ్‌లో దాదాపు 1.31కోట్ల మంది బాలికలు, మహిళలకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పంజాబ్ జనాభా 2.77కోట్ల కాగా వారిలో కోటి 46 లక్షల మంది పురుషులు, కోటి 31లక్షల మంది మహిళలున్నారు. తాజా పథకం వయసుతో సంబంధం లేకుండా పంజాబ్‌లోని మహిళలందరికీ వర్తించనుంది.
ఇదీ చదవండి: 'న్యూడ్ వీడియో కాల్స్'తో తస్మాత్ జాగ్రత్త!