free ration scheme extended: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు" అని పేర్కొన్నారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తోంది. 2020 ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. మార్చి నెలాఖరుతో దీనికి గడువు ముగియనున్న వేళ ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం పీఎంజీకేఏవై పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించినట్టు మోదీ ప్రకటించడం విశేషం.
ఇదీ చదవండి: '31న ఉదయం 11 గంటలకు.. డప్పులు, గంటలు మోగించండి'