ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి, వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానంతో వృద్ధుడి కుమారుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. బాందా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం..
చున్ను కుష్వాహ అనే వ్యక్తి.. తన కుటుంబసభ్యులతో జిల్లాలోని గిర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోఖర్ బుజుర్గ్ గ్రామంలో నివసిస్తున్నారు. చున్నుకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. చున్ను కుమారుడు తరచూ కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. శనివారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో దుండగులు పదునైన ఆయుధంతో అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం చున్ను మృతదేహాన్ని ఇంటి పెరట్లో విసిరేశారు.
ఆదివారం తెల్లవారుజామున ఇంటి పైకప్పుపై చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్పీ అభినందన్ డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో ఇద్దరు మహిళల మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలను పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిర్జీవంగా పడి ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారిని చూసి చుట్టుపక్కల వారు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెెెందిన కారణంగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. చున్ను కుమారుడు అతడి కోడలు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. దీంతో అనుమానంతో పోలీసులు చున్ను కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణం అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా వాటి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అభినందన్ తెలిపారు.
దిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో ఆదివారం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం సొంత అత్తమామలను కోడలే హత్య చేసిందని గుర్తించారు. స్నేహితుడి సహాయంతో ఆమె ఇద్దరి గొంతు కోసి చంపిందని తేల్చారు. నిందితురాలు మోనికాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.