దేశ రాజకీయాల్లో ములాయంది ఓ ప్రత్యేక స్థానం. రాజకీయ మాంత్రికుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేతాజీగా ప్రాచుర్యం పొందిన ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేసిన ములాయం.. జాతీయ పార్టీల అజెండాను ప్రాంతీయ పార్టీలు నిర్దేశించగలవంటే ఎవరూ విశ్వసించలేదు. కానీ కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధ్యం చేసి చూపారు. చిన్నప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా జాతీయ స్థాయిలో తమ గళాన్ని వినిపించేలా.. లౌకికశక్తులను కూడగట్టి తృతీయ కూటమిని తీర్చిదిద్దారు. కాంగ్రెస్, భాజపా వ్యతిరేకశక్తులతో కూడిన తృతీయ కూటమికి ప్రధాన రూపకర్తగా దేశ రాజకీయ చరిత్ర పుటల్లో నిలిచారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఈ సోషలిస్ట్ నేత విజయవంతమయ్యారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూడగా భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదు. 1996, 1998లో వరుసగా హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ సారథ్యంలో తృతీయ కూటమి ప్రభుత్వాల ఏర్పాటులో ములాయం చక్రంతిప్పారు. అప్పటి నుంచి కేంద్రంలో మొదలైన ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం, ప్రాబల్యం ఇంకా కొనసాగుతోంది.
స్వతహాగా రెజ్లర్ అయిన ములాయం.. అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా, జాతీయ నాయకుడిగా ఎదిగారు. 1939 నవంబర్ 30న ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించిన ఆయన ఆగ్రా యూనివర్సిటీ నుంచి రాజకీయ విజ్ఞానశాస్త్రంలో MA పూర్తి చేశారు. 15ఏళ్ల వయసులోనే సోషలిజం పట్ల ఆకర్షితులైన ములాయం ప్రముఖ సోషలిస్టు నేతగా గుర్తింపు పొందిన రామ్ మనోహర్ లోహియా ప్రభావానికి లోనయ్యారు. ఆయన సారథ్యంలో సాగిన సోషలిస్టు ఉద్యమంలో పాల్గొన్న ములాయం.. 3నెలలు కారాగారంలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు ముద్దుగా నేతాజీ అని పిలుచుకునే ములాయం.. 1989లో తొలిసారి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవటం వల్ల.. 1992లో సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసేవరకూ చంద్రశేఖర్ సారథ్యంలోని సమాజ్‌వాదీ జనతా పార్టీతో జతకట్టారు. యూపీలో కాంగ్రెస్ మద్దతుతో సీఎంగా కొనసాగారు.
ములాయం రాజకీయ ప్రస్థానం రెజ్లింగ్ రింగ్ నుంచి ప్రారంభమైంది. 1962లో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్.. ఆయన జీవితాన్ని గొప్ప ములుపు తిప్పింది. జశ్వంత్‌నగర్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో సత్తాచాటిన ములాయం యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నేత నాథూసింగ్‌ను ఆకర్షించారు. ములాయంను ఆయన యూపీ రాజకీయ యవనికపై పరిచయం చేస్తే.. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించి ములాయం అనతికాలంలోనే జాతీయ నేతగా గుర్తింపు పొందారు. 1967 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నాథూసింగ్.. ములాయంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ సోషలిస్ట్ నేత రాజకీయ ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగింది. 10సార్లు ఎమ్మెల్యేగా, 7సార్లు పార్లమెంటు సభ్యునిగా ములాయం ఎన్నికయ్యారు. యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేసిన ఆయన ఒకసారి రక్షణ మంత్రిగా సేవలందించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రతిసారి నిజమైన రెజ్లర్‌గా ములాయం పుంజుకున్నారు.
1991లో మారిన రాజకీయ సమీకరణలతో చంద్రశేఖర్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. యూపీలో అదే పార్టీ మద్దతుతో కొనసాగుతున్న ములాయం ప్రభుత్వం కూడా కుప్పకూలింది. 1991లో జరిగిన యూపీ శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో ములాయం సారథ్యంలోని జనతాదళ్ పార్టీ ఓటమి పాలైంది. యూపీలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమ పునాదులు బలపరుచుకోవాలని భావించింది. అయితే 1992 డిసెంబర్ 6నాటి బాబ్రీ ఘటనతో భాజపాకు చెందిన యూపీ సీఎం కల్యాణ్ సింగ్ రాజీనామా చేయగా.. రాష్ట్రపతి పాలన విధించారు. 1993 డిసెంబర్‌లో యూపీ శాసనసభ ఎన్నికలు జరగగా.. రామ మందిర్ నినాదంతో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ బహుజన సమాజ్‌పార్టీతో చేతులు కలిపిన ములాయం.. కమలనాథుల అవకాశాలకు గట్టి దెబ్బకొట్టారు. హిందూ, ముస్లింల ఓట్లను కూడగట్టడం ద్వారా ములాయం రెండోసారి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత బీఎస్పీతో ఎస్పీ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐనా భాజపా, బీఎస్పీ ఓట్లలో చీలిక తెచ్చేందుకు ములాయం పన్నిన వ్యూహం ఫలించింది. యూపీకి ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రత్యర్థులపై పైచేయి సాధించటం సహా వర్తమాన రాజకీయాల్లో ప్రముఖ నేతగా కొనసాగిన ములాయం తన చివరిరోజుల్లో కుటుంబంలో వచ్చిన వివాదాన్ని మాత్రం సరిదిద్దలేకపోయారు. 2012లో తన కుమారుడు అఖిలేష్ యూపీ సీఎం పగ్గాలు చేపట్టాక ములాయం కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. అఖిలేష్, ములాయం వర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయాయి.
అఖిలేష్ వర్గానికి ములాయం బంధువు, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ వర్గం మద్దతు లభించింది. ములాయం వర్గానికి ఆయన సోదరుడు, యూపీ ఎస్పీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్, మిత్రుడు అమర్‌సింగ్ అండగా నిలిచారు. అఖిలేష్ తన బాబాయ్ శివపాల్ యాదవ్‌ను కేబినెట్ నుంచి తప్పించి పార్టీలో తండ్రి అధికారానికి సవాల్ విసిరారు. 2016 డిసెంబర్ 30న క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అఖిలేష్‌తోపాటు తన బంధువు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం ప్రకటించారు. అయితే 24గంటల్లోనే తన నిర్ణయం ఆయన వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 2017 జనవరి ఒకటిన ఎస్పీ జాతీయ సమావేశాల్లో ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అఖిలేష్ చీఫ్ ప్యాట్రన్‌గా నియమించారు.
ఈ చర్యతో రగిలిపోయిన ములాయం పార్టీ జాతీయ సమావేశాల నిర్వహణ అక్రమమంటూ ఆ సమావేశాల నిర్వహణకు బాధ్యుడైన రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అధికారం రాంగోపాల్ యాదవ్‌కు ఉందంటూ ఎన్నికల సంఘం రూలింగ్ ఇవ్వటంతో ములాయం ఇచ్చిన బహిష్కరణ ఉత్తర్వులు రద్దయ్యాయి. దీంతో అఖిలేష్ అధికారికంగా సమాజ్‌వాదీ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడయ్యారు. అఖిలేష్ ఆయన్ను కీలక పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీతోపాటు యూపీలోను ములాయం పట్టు కోల్పోవాల్సి వచ్చింది. చనిపోయేవరకూ మొయిన్‌పూరి ఎంపీగా ములాయం కొనసాగారు.
చివరి రోజుల్లో అధికారంలో లేకున్నా ములాయం ప్రయత్నం వల్ల ఏకమైన లౌకిక ప్రాంతీయశక్తులకు కేంద్రంలో తమగళం వినిపించే అవకాశం దొరికింది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు రాష్ట్రాల న్యాయమైన డిమాండ్లు, హేతుబద్ధంగా పరిశీలించక తప్పని పరిస్థితులకు ములాయం మార్గం చూపారు. రాజకీయ కురు వృద్ధుడు ములాయం మరణంతో.. ఉత్తర ప్రదేశ్‌లోనూ దేశ రాజకీయాల్లోనూ ఓ శకం ముగిసింది.