ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. గతవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. అప్పటి నుంచి ప్రాణాధార వ్యవస్థపై ఉన్న ఆయన.. సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖులు సంతాపం: ములాయం మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేదాంత ఆస్పత్రికి వెళ్లి ములాయం పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
యూపీలో మూడు రోజులు సంతాప దినాలు: ములాయం మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయన అంత్యక్రియల కోసం సైఫయి వెళ్లనున్నారు.
ములాయం.. ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్ యాదవ్ దంపతులకు జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఉత్తర్‌ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.