అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మహ్మద్‌జాన్ (72) హఠాన్మరణం చెందారు. వేలూరు జిల్లా రాణిపేట్‌లోని తన నివాసంలో మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్.ఎం. సుగుమార్ తరఫున మంగళవారం మధ్యాహ్నం ఇంటింటి ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికెళ్లే ముందు కూడా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.
అయితే.. ఇంట్లో ఉన్నసమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పిరావడం వల్ల కుటుంబ సభ్యులు కారులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 2019 జులైలోనే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2011లో ఆయన తమిళనాడు మంత్రిగా పనిచేశారు.
మహ్మద్‌జాన్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: 'చివరకు మిగిలేది మోదీ అబద్ధాల ఫ్యాక్టరీనే!'