TDP former minister Bandaru Arrest: ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా నడుమ.. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు... 41A, 41B నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్లీ ప్లాన్ మార్చిన పోలీసులు... అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా నేతలు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు.
అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని తెదేపా శ్రేణులు మండిపడ్డాయి. దీంతో సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే,.. బండారుకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చేందుకు.. పలువురు పోలీసులు గేటు దూకి మరీ ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. తొలుత అనుకున్న విధంగా కాకుండా ప్లాన్ మార్చిన పోలీసులు... అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా మంగళగిరికి తలిస్తున్నారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసుల నుంచి తప్పకుండా బయటపడతానని బండారు స్పష్టం చేశారు. ధర్మం తప్పనిసరిగా గెలుస్తుందన్నారు.
బండారును ధైర్యంగా ఉండాలన్న లోకేశ్: బండారు సత్యనారాయణమూర్తికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని, పోరాటాన్ని కొనసాగించాలని చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులకు ఇబ్బందులు తప్పవని లోకేశ్ తెలిపారు. బూతులు తిట్టే మంత్రులపై ఏఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన ప్రశ్నించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన పోరాటం ఆపేది లేదని బండారు లోకేశ్‌కు చెప్పారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం, మంత్రులు, వైసీపీ నేతల బూతుకూతలపై ఎన్ని కేసులు పెట్టాలంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతుకూతలు వద్దన్న బండారును దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. వైకాపాకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టమా? ఇదేం పాలన? అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
బండారు సతీమణి పోలీసులకు ఫిర్యాదు: బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా గత రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల పాటు తన భర్త బండారు సత్యనారాయణ మూర్తినిఏ విధమైన నోటీసు ఇవ్వకుండా గృహనిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. సుమారు 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ భయాందోళన కలిగించారని మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలాసేపటి నుంచి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ స్పందించలేదని తెలిపారు. కనీసం ఫిర్యాదు తీసుకున్నదానికి రసీదు కూడా ఇవ్వలేదని, బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే... టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పర్యాటకశాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ వ్యక్తిగత దూషణలు చేశారంటూ.. వైసీపీ కార్యకర్త మంజుల చేసిన ఫిర్యాదు మేరకు పోలీలు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఫిర్యాదు అందగా.. అక్టోబర్ 1న కేసు నమోదు చేసినట్లు సమాచారం. బండారు సత్యనారాయణపై పలు సెక్షన్లతో పాటు.. ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బండారు సత్యనారాయణను విశాఖలో అరెస్టు చేసి గుంటూరు తీసుకువచ్చే అవకాశముందని సమాచారం. దీనికోసం గుంటూరు పోలీసులు విశాఖ వెళ్లారు. అనకాపల్లి జిల్లా వెన్నెల పాలెంలోని ఆయన నివాసం వద్ద సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. ఆయన నివాసం వద్దకు మీడియా వెళ్లకుండా అంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అక్కడికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.