ఆయన ఓ మాజీ సైనికుడు.. మాజీ మేజిస్ట్రేట్.. కమిషనర్.. కేంద్ర శాఖల్లోని ఉన్నత స్థానాల్లో పనిచేసిన వ్యక్తి.. సివిల్ సర్వెంట్‌గా అనేక సంవత్సరాలు సేవలు అందించిన ఆయన.. సన్యాసిగా మారి తన లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆయనే మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కమల్ టావరీ.
2006లో ఉద్యోగ విరమణ అనంతరం కమల్ సన్యాసిగా మారారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో సన్యాసం స్వీకరించారు. అనంతరం తన పేరును స్వామి కమలానంద మహారాజ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రపంచయాత్ర చేశారు. గత 16 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాలను సందర్శించారు. వ్యవసాయంలో అనేక సమస్యలు ఉన్నాయని గ్రహించిన ఆయన.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. దేశ ప్రజలు వ్యవసాయం వైపు మళ్లితే.. ప్రతి వ్యక్తి అభివృద్ధి వైపు పయనించినట్లవుతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 'ఈటీవీ భారత్'తో కమల్ టవారీ మాట్లాడారు.
"నా శేష జీవితాన్ని సాధువులతో గడుపుతా. గోవుల పెంపకం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువస్తా. ప్రజలు.. ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వారంతటవారే స్వయం ఉపాధిని కల్పించుకోవాలి. ప్రభుత్వం కొద్ది నెలల క్రితం సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకాన్ని ఇతర శాఖలలో కూడా అమలు చేయాలి. దేశంలో ఆనాటి గురుకులాలు మళ్లీ ప్రారంభం కావాలి."
-కమల్ టావరీ
ఎవరీ కమల్ టావరీ..
1946 ఆగస్టు 1న మహారాష్ట్రలోని వార్దాలో కమల్ టావరీ జన్మించారు. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలనే అభిరుచిని కలిగి ఉండేవారు. కమల్.. సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు 6 సంవత్సరాలు సైన్యంలో కర్నల్ హోదాలో పనిచేశారు. 1968లో సివిల్స్‌లో చేరారు. 22 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ విభాగాల్లో ప్రజలకు సేవలందించారు. 40 పుస్తకాలను రాశారు. అలాగే LLBతో పాటు ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. అలాగే ఫైజాబాద్ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌తో సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించారు.