టూల్‌కిట్ కేసులో దిశా రవి అరెస్టును విమర్శిస్తున్న వారిపై న్యాయవ్యవస్థ, పోలీసు శాఖలోని మాజీలు ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం, దేశ వ్యతిరేక భావనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
లేఖ రాసిన 47 మందిలో రాజస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ వీఎస్ కోక్జే, దిల్లీ మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, పంజాబ్ మాజీ డీజీపీ పీసీ డోగ్రా, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు, కేరళ మాజీ డీజీపీ పద్మనాభన్ ఉన్నారు.
పోలీసులకు అపవాదు..
నిరాధార ఆరోపణలతో దిల్లీ పోలీసులను అపవాదు పాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల చర్యను సమర్థిస్తూ టూల్కిట్లో పేర్కొన్న వ్యక్తులు, సంఘాలకు ఐఎస్ఐ, ఖలిస్థానీ బృందంతో సంబంధం ఉన్నట్లు తేలిందని చెప్పారు.
ప్రభుత్వానికి అప్రతిష్ఠ..
భారత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేలా అమెరికా, ఐరోపాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సుల్ జనరల్ కార్యాలయాల వద్ద నిరసనలు చేసే విద్రోహ శక్తలతో సంబంధాలు పెట్టుకోవడాన్ని మాజీలు తప్పుబట్టారు. తద్వారా ప్రవాసులు, విదేశాల్లో ఎన్నికైన నేతలను తప్పుదోవ పట్టించి, భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
దిశ యుక్త వయస్కురాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవరించినందున కేసుకు వయసుతో సంబంధం లేదని అన్నారు.
ఇదీ చూడండి: టూల్‌కిట్ కేసు: మూడు రోజుల కస్టడీకి దిశ రవి