Jobs For Farmers Kin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది పంజాబ్ సర్కార్. ఈ మేరకు పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రణదీప్‌సింగ్ నభా.. అర్హులైన కుటుంబాలకు ఉద్యోగ పత్రాలు అందజేశారు. బాధిత కుటుంబాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చన్నీ తెలిపారు.
రైతులపై పూలవర్షం..
Flower Petals On Farmers: దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు విరమించిన రైతులు నిరసన స్థలాలు ఖాళీ చేసి ఇళ్ల బాటపట్టారు. ఈ క్రమంలో దిల్లీ నుంచి పంజాబ్‌కు తిరిగి వస్తున్న రైతులపై పూలవర్షం కురించాడు ఓ ఎన్ఆర్ఐ. రైతులు శంభు సరిహద్దు చేరుకోగానే వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక విమానం ద్వారా ఈ ఏర్పాటు చేశారు.
రైతుల ప్రత్యేక పూజలు..
ధర్నా శిబిరాలను ఖాళీ చేయడానికి ముందు దిల్లీ- పంజాబ్ సరిహద్దులోని గాజీపుర్‌లో రైతులు అర్దాస్( ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు.
ఇద్దరు రైతులు మృతి..
ధర్నా శిబిరాలను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్తున్న ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టిక్రి సరిహద్దు వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. మృతుల్లో ఒకరికి 40, మరొకరికి 34 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు.
బారికేడ్లు తొలగింపు..
రైతులు నిరసన స్థలాలను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు పోలీసులు. దశల వారీగా బారికేడ్లను తొలగిస్తామని అధికారులు వెల్లడించారు.