పుదుచ్చేరి శాసనసభలో నేడు (సోమవారం) బలనిరూపణ జరగనుంది. వరుస రాజీనామాలతో డీలాపడిన అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమి ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి మైనారిటీలో ఉంది.
మరో ఎదురుదెబ్బ..
ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణన్, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఐదుగురు సభ్యుల రాజీనామాలతో పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది అధికార కూటమి.
జులైలో ఓ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. కాగా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో మొత్తంగా ఏడు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సభలో 26 మంది సభ్యులు ఉండగా మెజారిటీకి 14 మంది అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 9, డీఎంకేకు 2 ఎమ్మెల్యేలతో కూటమి బలం 11కు పడిపోయింది.
బలంగా ప్రతిపక్షం..
ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, భాజపా 3(నామినేటెడ్) ఎమ్మెల్యేలతో విపక్ష కూటమికి 14 మంది సభ్యుల బలం ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఇంతకాలం ప్రభుత్వానికి మద్దతుదారుగా వ్యవహరిస్తూ వచ్చారు.
పార్టీ నేతలతో సీఎం భేటీ..
ఆదివారం మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ముఖ్యమంత్రి నారాయణ స్వామి. పలు సూచనలు వచ్చినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. సభలో సోమవారం ప్రత్యేక సెషన్‌కు ముందు మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'మా నాన్నను చంపినవారిపై కోపం లేదు.. క్షమించేశా'