అమర్‌నాథ్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడారు. యాత్రికులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని అమిత్ షా తెలిపారు. మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమర్‌నాథ్ వరదలపై సమీక్షించారు. కేంద్ర పాలిత ప్రాంత అధికారులతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉందని చెప్పారు. అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ప్రధాని మోదీ తీవ్ర విచారం: మరోవైపు, అమర్‌నాథ్‌లో చోటుచేసుకున్న విషాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.
"జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడాను. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజల ప్రాణాలను కాపాడడమే మా ప్రాధాన్యత"
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ప్రస్తుతం వర్షం కురుస్తున్నా.. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే. యాత్ర ప్రాంగణమంతా ముంపునకు గురి కావడం వల్ల అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వరదలు తగ్గుముఖం పట్టాక తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. ఆర్మీ, సహాయక బృందాలు కలిసి సహాయక చర్యలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
"పెద్ద ఎత్తున వచ్చిన వరదల్లో టెంట్లు కొట్టుకుపోయాయి. వరదల్లో ఇప్పటివరకు 13 మంది మృతిచెందారు. వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడాం. రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బయల్దేరి వెళ్తోంది. సహాయక చర్యల్లో సైన్యం, ఐటీబీపీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం"
- అతుల్ కార్వాల్, ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ
"కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. బలగాలు అప్రమత్తమై యాత్రికులను రక్షించేందుకు చర్యలు కొనసాగిస్తున్నాయి. టెంట్ల నుంచి 10-15 నిమిషాల్లోనే యాత్రికులను తరలించాం. వరదల్లో చాలా గుడారాలు కొట్టుకుపోయాయి. నదిలో కొట్టుకుపోతున్న కొందరిని రక్షించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. వరద బాధితులకు ఆహారం, వసతి ఏర్పాట్లు చేశాం. అమర్‌నాథ్‌లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. అవసరమైతే రాత్రి కూడా సహయక చర్యలు చేపడతాం. వరదల దృష్ట్యా అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశాం. వాతావరణం అనుకూలిస్తే శనివారం యాత్రను పునరుద్ధరిస్తాం"
- ఐటీబీపీ పీఆర్వో