తమిళనాడులో చెన్నై నుంచి త్రివేండ్రం వెళ్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు భాజపా నేతలు ఎమర్జెన్సీ డోర్ తెరిచారన్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 10న జరిగిన ఈ ఘటన కారణంగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా విమానం 3 గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. దీనిపై డీజీసీఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయకపోయినా.. ఈ వ్యవహారాన్ని తాము పరిశీలిస్తున్నామని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. ఈ పని చేసింది భాజపా ఎంపీ తేజస్వీ సూర్య, తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అని ఆరోపిస్తూ తమిళనాడు రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ డిసెంబర్ 29న ట్వీట్లు చేశారు.
"డిసెంబర్ 10వ తేదీన 'ఫొటోషాప్' పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇలజ్ఞరాణి జాతీయ అధ్యక్షుడు బాధ్యతారహితంగా విమానం టేకాఫ్ అవుతుండగా అత్యవసర ద్వారాన్ని తెరిచారు. ఈ కారణంగా విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. క్షమాపణ లేఖ రాయడం ఆచారం కాబట్టి ఆ రోజు తేజస్వీ సూర్య క్షమాపణ లేఖ రాశారు. కానీ, ఈ వార్త మీడియాలో ఎందుకు రావడం లేదు?"
-సెంథిల్ బాలాజీ, తమిళనాడు రాష్ట్ర మంత్రి
"డిసెంబర్ 10న చెన్నై నుంచి త్రివేండ్రం వెళ్లే ఇండిగో 6ఈ-7339 విమానంలో ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది భద్రతా పరమైన సూచనలు చేస్తున్న సమయంలో అత్యవసర ద్వారాన్ని తెరిచారు. దీంతో ప్రయాణికులు భయపడ్డారు. ఆ తర్వాత సిబ్బంది ప్రయాణికులను కిందకు దించి ప్రెషరైజేషన్ చెక్ చేశాక విమానాన్ని తిరిగి టేక్ఆఫ్ చేశారు".
--డీజీసీఏ అధికారి
ఘటన జరిగిన రోజున ఆ విమానంలో బెంగళూరు సౌత్ లోక్సభ ఎంపీ తేజస్వీ సూర్య, తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఉన్నారని తోటి ప్రయాణికులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత తేజస్వీకి వేరే సీటు కేటాయించినట్లు తెలిసింది.