Five Skeletons Found in Ruined House : కర్ణాటక చిత్రదుర్గలో ఓ ఇంటి నుంచి 5 అస్తిపంజరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఇంటి యజమాని అయిన ప్రభుత్వ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులవేనని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు చేయించి, ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
2019 నుంచి కనిపించని జగన్నాథ్ కుటుంబం!
అస్తిపంజరాలు ఉన్న భవనం చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో ఉంది. ఆ ఇంటి యజమాని జగన్నాథ్ రెడ్డి(85). ఆయన తుమకూరు పీడబ్ల్యూడీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. జగన్నాథ్ రెడ్డితోపాటు ఆయన భార్య ప్రేమ(80), కుమార్తె త్రివేణి(62), కుమారులు కృష్ణ(60), నరేంద్ర(57) అదే ఇంట్లో ఉండేవారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వీరంతా ఇతరులకు చాలా దూరంగా ఉండేవారని పోలీసుల విచారణలో తేలింది. 2019 జూన్-జులై తర్వాత వారు అసలు ఎవరికీ కనిపించలేదని తెలిసింది.
జగన్నాథ్ రెడ్డి ఇంట్లో అస్తిపంజరాలు ఉన్నాయని గురువారం స్థానిక మీడియా ప్రతినిధుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చిత్రదుర్గ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి లోపలకు వెళ్లిన వారికి దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఒక గదిలో మంచాలపై రెండు అస్తిపంజరాలు, నేలపై మరో రెండు అస్తిపంజరాలు ఉన్నాయి. అవన్నీ నిద్రపోతున్న భంగిమలో కనిపించాయి. మరో గదిలో ఐదో అస్తిపంజరం ఉంది. ఆ ఇంట్లోకి కొందరు అనేక సార్లు చొరబడి, చోరీలకు పాల్పడి ఉంటారని అక్కడి పరిస్థితిని చూసిన పోలీసులు అనుమానిస్తున్నారు.
"మేము గురువారం సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్లాం. ఆ కుటుంబానికి తెలిసినవాళ్లు, బంధువులతో మాట్లాడాం. జగన్నాథ్ కుటుంబంలోని వారంతా ఇతరులకు దూరంగా ఉండేవారని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారని అందరూ చెప్పారు. ఇల్లు ఎప్పుడూ లాక్ చేసి ఉండేది. రెండు నెలల క్రితం మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరు మెయిన్ డోర్ పగలగొట్టి ఉండడాన్ని గుర్తించారు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు." అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాల సేకరణకు దావణగెరె నుంచి నిపుణులను పిలిపించినట్లు చెప్పారు.
హత్యా? ఆత్మహత్యా?
"ఒక ఇంట్లో 5 అస్తిపంజరాలు ఉన్నట్లు తెలిసింది. అవి ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి, వారు ఎవరు అనే విషయాలు కనుగొనాలని పోలీసులను ఆదేశించాను. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వయసు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు అస్తిపంజరాల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ ఇల్లు ఎవరిది, ఎవరు ఉంటున్నారు అనే సమాచారం సేకరిస్తున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇంకా తెలియదు. దర్యాప్తు, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే తెలుస్తుంది. అప్పటివరకు ఏమీ చెప్పలేం" అని తుమకూరులో మీడియాతో చెప్పారు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర.
ఆస్తి కోసం స్నేహితుడి ఘాతుకం - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య
DTH రీఛార్జ్ కాలేదని దారుణం- షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం, ముగ్గురు యువకులు అరెస్ట్