Five Children Drowned In Pond : బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చెరువు నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాఖీ పండగ రోజు ఇలా జరగడం వల్ల ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలోని సలాయా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనార్చాక్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రక్షా బంధన్ సందర్భంగా చిన్నారులంతా తమ అక్కచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న చెరువుకు స్నానానికి వెళ్లారు. అయితే చెరువు కాస్త లోతుగా ఉండడం వల్ల నీట్లో మునిగిపోయారు.
అక్కడి కాసేపటి తర్వాత ఓ గ్రామస్థుడు చెరువు దగ్గరకు వెళ్లాడు. ఒడ్డున బట్టలు ఉండగా.. చెరువులో చిన్నారులు కనిపించలేదు. దీంతో భయపడి స్థానికులకు పిలిచాడు. వెంటనే అంతా కలిపి చెరువులో గాలించారు. చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మృతులను ధీరజ్(12), నీరజ్(11), ప్రిన్స్ కుమార్ (10 ఏళ్లు), అనూజ్ (12) అమిత్ కుమార్ (8)గా గుర్తించారు.
యూపీలోనూ..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లాలో కూడా ఇద్దరు చిన్నారులు.. నీట మునిగి మరణించారు. తిల్హర్ ప్రాంతంలోని అజ్మత్‌పుర్ గ్రామంలో ప్రియాంషు(10), సందీప్ (11) చెరువులో స్నానం చేస్తుండగా మునిగిపోయారని అధికారి ప్రియాంక్ జైన్ తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను చెరువులో నుంచి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు.
అమ్మమ్మ ఇంటికి వెళ్లి..
కొన్ని నెలల క్రితం.. కర్ణాటకలోని మండ్యలో వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. విశ్వేశ్వరయ్య అనే కాలువలో ఈత కోసం వెళ్లి అందులో పడి దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉండే ఓ కుటుంబం వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఓ కాలువ వద్దకు ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ముందుగా ఓ బాలుడు నీటిలో జారి పడ్డాడు. అతడిని కాపాడే యత్నంలో మిగిలిన నలుగురు కాలువలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.