ఆయుధాలు, రక్షణ పరికరాల దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు పడనుంది. భారత్ దేశీయంగా రూపొందించనున్న.. అణ్వాయుధ దాడి సామర్థ్యం గల 3 జలాంతర్గాముల నిర్మాణంలో 95శాతం దేశీయ పరికరాలను వినియోగించనున్నారు. ఆ తర్వాత నిర్మించే మరో మూడు సబ్మెరైన్లలో దేశీయ పరికరాల వాటాను మరింత పెంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రూ. 50వేల కోట్లతో మూడు జలాంతర్గాముల తయారీ ప్రతిపాదనను భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిశీలిస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు చెందిన విశాఖపట్నం కేంద్రంలో వీటిని తయారు చేస్తారు. త్వరలోనే ఈ జలాంతర్గాముల సంఖ్యను ఆరుకు పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సహా దేశీయ రక్షణ రంగానికి వీటి తయారీ ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చి, ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
విదేశాల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయగలమని నమ్మకంతో ఉన్నట్లు డీఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆ అవసరం వస్తే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల నుంచి సాయం తీసుకుంటాయని తెలిపాయి.
ఇవీ చదవండి: