తొలిసారి ఓ సామాన్య భారతీయుడికి పునీత హోదా (సెయింట్ హుడ్) దక్కనుంది. ఈమేరకు 18వ శతాబ్దంలో క్రైస్తవాన్ని స్వీకరించిన దేవసహాయం పిళ్లైకి.. 2022 మే 15వ తేదీన పోప్ ఫ్రాన్సిస్ పునీత హోదాను ప్రకటిస్తారని తిరువనంతపురంలోని చర్చి అధికారులు తెలిపారు. వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ చర్చిలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి వాటికన్‌లో మంగళవారం ప్రకటన వెలువడినట్లు చెప్పారు. 1745లో క్రైస్తవాన్ని స్వీకరించిన పిళ్లై అనంతరం లాజరస్‌గా పేరు మార్చుకున్నారు.
"ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాల్లో సమానత్వం గురించి గట్టిగా చెప్పేవారు. దీంతో ఉన్నత వర్గాల్లో ద్వేషం రగిలింది. 1749లో ఆయన అరెస్టయ్యారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన 1752 జనవరి 14న జరిగిన కాల్పుల్లో అమరులయ్యారు" అని వాటికన్ ఓ ప్రకటనను రూపొందించింది.
1712 ఏప్రిల్ 23న కన్యాకుమారి జిల్లా (తమిళనాడు)లోని నట్టాలంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ఈ ప్రాంతం అప్పట్లో ట్రావెన్‌కోర్ సామ్రాజ్యంలో ఉండేది. పుట్టిన 300 ఏళ్లకు, 2012లో ఆయనను పునీతునిగా గుర్తించారు.
ఇదీ చూడండి: నిన్న పద్మ పురస్కారం స్వీకరణ- నేడు ప్రభుత్వంపై నిరసన