Electrical boat: 'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పేరొందిన కేరళలో ఎక్కడ చూసినా... నీళ్లే దర్శనమిస్తాయి. దాంతో చాలా మంది కేరళవాసులు ఒకచోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే పడవలనే ఆశ్రయిస్తారు. అయితే.. పడవల్లో ప్రయాణం అంటే కాస్త ఆలస్యంగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో.. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్(కేఎంఆర్ఎల్) వినూత్న ఆలోచనతో ముందుకువచ్చింది. ప్రయాణికులను త్వరగా తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో.. దేశంలోనే మొదటిసారిగా 'వాటర్ మెట్రో' ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా.. బ్యాటరీతో నడిచే బోటును కేఎంఆర్ఎల్కు కొచ్చి షిప్‌యార్డు అప్పగించింది.
Kerala water metro project: వంద మందితో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్ బోటులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బోటు... పదిహేను నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. గంటకు 10 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. నీళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రకృతి అందాలను ప్రయాణికులు వీక్షించే విధంగా దీన్ని రూపొందించారు. అంతేకాదు.. ఒకవేళ ఈ బోటు ఛార్జింగ్ అయిపోయినట్లైతే దానంతట అదే.. డీజిల్ ఆప్షన్‌కు మారిపోయి ప్రయాణించగలదు. పైగా.. ప్రపంచంలోనే విద్యుత్‌తో నడిచే అతిపెద్ద బోటు ఇదే.
మొత్తం 23 విద్యుత్ బోట్లు కొచ్చి షిప్‌యార్డ్ రూపొందిస్తుండగా... అందులో ఐదింటి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. 'వాటర్ మెట్రో ప్రాజెక్టు' కోసం టెర్మినల్ నిర్మాణాలు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వైతిలా, కక్కండ్ ప్రాంతాల్లో టెర్మినల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫ్లోటింగ్ జెట్టీస్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్టు మొత్తం 76 కిలోమీటర్ల పొడవుతో.. 38 టెర్మినళ్లను కలుపుతూ నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: చెన్నైలో మళ్లీ వర్ష బీభత్సం- ఇబ్బందుల మధ్యే న్యూఇయర్‌కు స్వాగతం!
ఇదీ చూడండి: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య