Fire broke out in hospital: బంగాల్లోని బుర్ద్వానా వైద్య కళాశాల, ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కొవిడ్ రోగి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు కొవిడ్ వార్డులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మృతుడ్ని సంధ్యా మోండల్(60)గా గుర్తించారు అధికారులు. అతడు కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ప్రమాదం జరిగిన వార్డులోని ఇతర రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను ఆర్పివేసినట్లు చెప్పాయి. వార్డులో మంటలు చెలరేగిన క్రమంలో కాపాడాలని మృతుడు మోండల్ ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదని, దాంతో మంటల్లో కాలిపోయి ప్రాణాలు ఒదిలాడని అతని బంధువు ఒకరు తెలిపారు.
దర్యాప్తునకు కమిటీ..
ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ తపాస్ కుమార్ ఘోష్ తెలిపారు.
భాజపా విమర్శలు..
రాష్ట్రంలోని ఆసుపత్రులు రోగుల పాలిట మృత్యుపాశాలుగా మారాయని ఆరోపించారు బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కొడుకును చంపి.. సైకిల్‌పై తీసుకెళ్లి కాల్చేసిన తల్లిదండ్రులు!