UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ఈ ఓటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి పరిధిలోని 10 స్థానాలు కూడా ఉన్నాయి.
ఆజామ్‌గఢ్, జాన్పుర్, మావ్, గాజీపుర్, వారణాసి, మిర్జాపుర్, భదోహి, సోన్‌భద్రా, చండోలీ జిల్లాల్లో ఈ ఓటింగ్ జరుగుతోంది. చండోలీలోని చకియా.. సోన్భద్రాలోని రాబర్ట్‌గంజ్, దుధి ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది.
బరిలో ప్రముఖులు
చివరి దశ పోలింగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నీల్‌కాంత్ తివారీ ఉన్నారు. ఈయన వారణాసి సౌత్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు శివ్‌పుర్-వారణాసి నియోజకవర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాసి నార్త్ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్ నుంచి రామశంకర్ సింగ్ పటేల్‌లు పోటీపడుతున్నారు. అంతేగాకుండా క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన ధారాసింగ్ చౌహాన్.. ఘోశి నుంచి పోటీలో ఉన్నారు.
2.6 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలతో తేల్చనున్నారు. ఈ పోలింగ్‌తో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి : రాష్ట్రపతి ఎన్నికపై.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఎంత?