father standing in front of train: వినికిడి లోపం ఉన్న కుమారుడికి వింత చికిత్స చేయించాడు ఓ తండ్రి. రైలు హారన్ శబ్దం వింటే వినికిడి లోపం నయమవుతుందనే భావనతో ఆర్నెళ్ల కుమారుడితో ప్రయోగాలు చేశాడు. పసిపిల్లాడిని ఒడిలో పెట్టుకొని రైలు పట్టాలపై అడ్డంగా నిల్చున్నాడు. రైలు ముందుకు కదలనిచ్చేది లేదంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లోని గంజ్ మొరాదాబాద్ సమీపంలో జరిగింది.
పట్టాలపై వ్యక్తి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్.. ముందుజాగ్రత్తగా రైలును కదిలించకుండా ఆపేశాడు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, పిల్లాడి తండ్రి మాత్రం పట్టాల మీది నుంచి పక్కకు జరిగేదే లేదంటూ మంకుపట్టు పట్టాడు. స్థానికులు ఎంతగా వారించినా పక్కకు జరగలేదు. లోకోపైలట్ రైలు దిగి అతడిని పట్టాల మీది నుంచి దించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. రైలు హారన్ మోగిస్తేనే కదులుతానని చెప్పుకొచ్చాడు.
చేసేదేమీ లేక..
ఎంత చేసినా పట్టాల పైనుంచి జరగడం లేదని భావించిన లోకో పైలట్.. అతడి డిమాండ్‌కు ఒప్పుకున్నాడు. హారన్ మోగిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం, రైలు హారన్ మోగించాడు లోకో పైలట్. హారన్ శబ్దం విన్నతర్వాతే ఆ వ్యక్తి పట్టాలపై నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటనను స్థానికులు ఫోన్లలో బంధించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాకు చేరడం వల్ల.. విస్తృతంగా వైరల్‌గా మారాయి.
నెటిజన్ల భిన్నస్వరం..
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కుమారుడి ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలో తోచక తండ్రి పడిన ఆవేదన తమను కలచివేసిందని పలువురు పేర్కొన్నారు. అయితే, మరికొందరు మాత్రం.. ఆ వ్యక్తి మూఢనమ్మకాలు పాటిస్తున్నాడని, అది మంచిది కాదని అంటున్నారు. చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.