కన్న కూతురిపై కనికరం లేకుండా కర్కశత్వం ప్రదర్శించాడు ఓ కీచక తండ్రి. మైనర్‌గా ఉన్న ఆమెపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. భార్య సహకారంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పెట్టే బాధలు భరించలేని ఆ బాధితురాలు ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుంది. పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి.. ఎగ్జామ్ హాల్‌కు బదులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తండ్రి అఘాయిత్యం గురించి వారికి ఫిర్యాదు చేసింది. హరియాణాలో ఈ దారుణం ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెవారీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. కూతురిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. అందుకు అతడి భార్య సైతం సహకరించింది. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది. మంగళవారం పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బాధితురాలు బయటకు వచ్చింది. అనంతరం పరీక్ష కేంద్రానికి వెళ్లకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. " ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. బాధితురాలు తల్లిదండ్రులను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశాం. తనపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఎవరికైనా చెబితే కాళ్లు, చేతులు నరికేసి చెంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది." అని పోలీసులు తెలిపారు.
పోలీసుల కోసం పెట్టిన బాంబు పేలి..
బంగాల్లో ఐఈడీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి భార్య తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఐఈడీని నక్సలైట్లు అమర్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తమకు హాని కలిగించేందుకు ఇలా చేసినట్లు వారు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని గోయిల్కేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుల పేర్లు.. కృష్ణ పుర్తి(52), అతని భార్య నంది(45). వీరిద్దరూ ఇచహతు ప్రాంతానికి చెందిన వారు. బాధిత దంపతులిద్దరు పొలానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో వీరిలో ఒకరు.. ప్రమాదవశాత్తు భూమిలో పాతిపెట్టిన ఐఈడీపై కాలు పెట్టారు. దీంతో ఆ బాంబు పేలింది. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దారిలోనే కృష్ణ పుర్తి చనిపోయాడు. నంది మాత్రం విషమస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.