Father Made Mini Bullet for Daughter : దిల్లీకి చెందిన సయ్యద్ నూర్ అలామ్ తన కూతురు కోసం ఏదైనా తయారు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు సయ్యద్ కూతురు.. ఓ అమ్మాయి ద్విచక్ర వాహనం నడుపుతుండటం చూసి తనకూ ఓ బైక్‌ను తయారు చేయమని కోరింది. దీని కోసం సయ్యద్ తన స్నేహితుడి దగ్గర ఉన్న ఓ పాత స్కూటీని తీసుకున్నాడు. ఎనిమిది నెలల పాటు శ్రమించి మినీ బుల్లెట్‌ను తయారు చేశాడు. దానికి ముద్దుగా పింక్ బుల్లెట్ అని పేరు పెట్టాడు.
"నా కూతురు పుట్టినప్పట్నుంచి తన కోసం ఏదైనా చేయాలనుకున్నాను. తనకు 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బైక్‌లపై ఇష్టం ఉందని తెలిసింది. ఆరు-ఏడు ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనకు ద్విచక్ర వాహనాలపై ఇష్టం మరింత పెరిగిందని తెలుసుకున్నాను. అప్పుడే తన కోసం గేర్లు లేని చిన్న బైక్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. బైక్‌లు గేర్ల రహితంగా ఉండవు కాబట్టి స్కూటీని బైక్‌గా మార్చాలని అనుకున్నాను"
--సయ్యద్ నూర్ అలామ్, పాప తండ్రి
సయ్యద్ నూర్ అలామ్‌కు సొంతంగా ఓ గ్యారేజీ ఉంది. మినీ బుల్లెట్ రూపొందించడం కోసం ఆ గ్యారేజీనే వినియోగించుకున్నాడు. మినీ బుల్లెట్ తయారీకి రూ. 70 వేలు అయ్యిందని సయ్యద్ తెలిపాడు. అయితే ఈ బుల్లి బైక్ రహదారులపై నడపడం కోసం కాదని చెప్పాడు. దిల్లీ, హరియాణాలో ఉన్న ప్రత్యేక ట్రాక్‌ల మీద దీన్ని నడపవచ్చని వివరించాడు. స్కూటీని మినీ బుల్లెట్‌గా మార్చిన విధానాన్ని సయ్యద్ తన యూట్యూబ్ ఛానల్‌లో సైతం పోస్ట్ చేశాడు.
"మేము ఈ బుల్లి బైక్‌ను బయటకు తీయలేము. కానీ బయట నడిపేందుకు అనుమతి కోరాను. ఒకవేళ అనుమతులు వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఇది పిల్లల బైక్.. దీన్ని బయటకు తీసి మేము ఏమి చేయగలము? 18 ఏళ్లు దాటక ముందే బైక్ నడిపేందుకు ఎవరికీ లైసెన్స్ ఇవ్వరు. ఈ బుల్లి బైక్‌ను కేవలం ప్రత్యేకంగా ఉన్న ట్రాక్‌ల మీద మాత్రమే నడపవచ్చు."
--సయ్యద్ నూర్ అలామ్, పాప తండ్రి
ఫాదర్స్ డే రోజు.. మీ తండ్రికి ఇవ్వాల్సిన '5' స్పెషల్ 'ఆర్థిక' బహుమతులు ఇవే!