Father suicide: అతని మానసిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కట్టుకున్న భార్య ఏడాది కిందట గల్ఫ్ దేశాలకు వెళ్లింది. అదే సమయంలో కన్నతండ్రి మృతి చెందాడు. అటు భార్య దూరం కావడం, ఇటు తండ్రి చనిపోవడంతో మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో తన ఏడేళ్ల కొడుకుని రెండో అంతస్తు గదిలోకి తీసుకెళ్లి ఫోన్లో వీడియో తీయిస్తూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వైఎస్ఆర్ కడప జిల్లా చిలకల బావి వీధికి చెందిన షేక్ జమాల్ బాషా కొంత కాలంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య అరిఫిన్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న షేక్ జమాల్ బాషాకు వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఇక చేసేది లేక భార్య అరిఫిన్ ఏడాది కిందట గల్ఫ్ దేశాలకు వెళ్లింది. మూడేళ్ల కిందట అతని తల్లి మృతి చెందింది. ఇదిలా ఉండగా ఏడాది కిందట తండ్రి సైతం మృతి చెందాడు. అప్పటినుంచి అతని పరిస్థితి సరిగా ఉండేది కాదని స్థానికులు వెల్లడించారు. కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడేవాడు కాదని, కొంత కాలంగా అతనిలో మార్పు వచ్చిందని, ఎప్పుడు మౌనంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో గత బుధవారం తన ఏడేళ్ల కొడుకును రెండో అంతస్తు గదిలోకి తీసుకెళ్లాడు. అతని చేతికి సెల్ ఫోన్ ఇచ్చి షేక్ జమాల్ బాషా కుర్చీపై నిలబడి ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఆత్మహత్య దృశ్యాలను అతని కొడుకు సెల్ ఫోన్ లో చిత్రికరించాడు. తండ్రి చనిపోయిన విషయం తెలియక రోదిస్తూ కుమారుడు గదిలో నుంచి బయటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న వారందరూ ఏం జరిగిందంటూ అడగగా బాలుడు పైకి తీసుకెళ్లాడు. అప్పటికే షేక్ జమాల్ బాషా మృతి చెందాడు. కొడుకు చేత వీడియో తీయించుకుంటూ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. విషయం తెలుసుకున్న మృతుని సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని, ఇలా ఆత్మహత్య చేసుకుంటాని అనుకోలేదంటూ కుటుంబసభ్యులు తెలిపారు. తన తండ్రి తన కళ్ల ముందరే ఆత్మహత్య చేసుకున్న ఘటన నుంచి ఆ బాలుడు బయటపడలేకపోతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: