దేశ రాజధాని దిల్లీ రింగ్ రోడ్డుపై మంగళవారం 'కిసాన్ గణతంత్ర దివస్ పరేడ్' నిర్వహించనున్నారు రైతులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ఈ ట్రాక్టర్ ర్యాలీ చేపడుతున్నారు. ఈ ర్యాలీకి దిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. దిల్లీ సరిహద్దుల్లోని మూడు ప్రదేశాల నుంచి మాత్రమే ట్రాక్టర్ ర్యాలీకి అంగీకారం తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని రైతు సంఘాల నాయకులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించరాదని.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలన్నారు.
రూట్ మ్యాప్
దిల్లీ సరిహద్దులోని మూడు ప్రాంతాలతో ట్రాక్టర్ ర్యాలీ రూట్ మ్యాప్ తయారు చేశారు రైతులు. సింఘు సరిహద్దు నుంచి ట్రాక్టర్ పరేడ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సంజయ్ గాంధీ రహదారి, కంజావ్లా, బవానా, హరియాణాలోని ఆచిండి సరిహద్దుకు వెళతారు. టిక్రి సరిహద్దు నుంచి నాగ్లోయి, నజాఫ్‌గఢ్, రోహ్తక్ బై పాస్ మీదుగా అసోద టోల్ ప్లాజా వరకు ర్యాలీ ఉంటుంది. ఘాజీపుర్ సరిహద్దు నుంచి అప్సరా బోర్డర్, హపూర్ రోడ్, ఐఎమ్ఎస్ కాలేజ్, లాల్ కూన్ వరకు ర్యాలీగా వెళ్లి.. తిరిగి ఘాజీపుర్ కు చేరుకునెలా రూట్ మ్యాప్ రూపొందించారు.