కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం గాజీపూర్ సరిహద్దుల్లో రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికాయిత్‌ను కలిసి మాట్లాడారు. గౌరవ సూచకంగా టికాయిత్‌కు ఖడ్గాన్ని బహూకరించారు.
'రాకేశ్ టికాయిత్ తన తండ్రి మహేంద్ర సింగ్ టికాయిత్ మార్గాన్ని అనుసరిస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతు సమాజాన్ని గర్వించే విధంగా చేశారు. రైతుల సంక్షేమం కోసం మహేంద్ర సింగ్ టికాయిత్, ఎస్‌ఏడీ వ్యవస్థాపకులు ప్రకాశ్ సింగ్ బాదల్ సంయుక్తంగా గొప్ప పోరాటాలు చేశారు. రాకేశ్ నేతృత్వంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుంది' అని బాదల్ హామీ ఇచ్చారు.
అన్ని పార్టీలు కలిసిరావాలి..
రైతులు చేస్తున్న ఈ గొప్ప పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ కలిసి రావాలని సుఖ్బీర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన జనవరి 26న నిరసనల్లో పాల్గొని అరెస్టయిన రైతుల కుటుంబాలను కలిశారు. వారికి న్యాయపరమైన సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా.. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
దిల్లీ సింఘు సరిహద్దుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పంజాబ్ హరియాణా నుంచి వేలాది మంది రైతులు ఆదివారం సింఘు సరిహద్దుకు చేరుకున్నారు.