గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టే నిరసనల్లో భాగంగా రెండు లక్షల ట్రాక్టర్లతో రైతులు పరేడ్‌ను నిర్వహించనున్నారు. అదేరోజు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్రాక్టర్లు సిద్ధం..
పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల రైతులు తమ ట్రాక్టర్లతో దిల్లీ వైపు కదులుతున్నారని బీకేయూ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ప్రకటించారు. ఇప్పటికే పరేడ్‌లో పాల్గొనేందుకు లక్షకు పైగా ట్రాక్టర్లు సిద్ధంగా ఉండగా మరో లక్ష ట్రాక్టర్లు చేరుకుంటాయని తెలిపారు. ప్రతీ ట్రాక్టర్ జాతీయ జెండాను కలిగి ఉండాలని.. దేశభక్తి పాటలు మోగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
వార్‌రూమ్..
నిరంతర పర్యవేక్షణకు దాదాపు 40 మంది సభ్యులతో ఒక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైద్యులు, భద్రతా సిబ్బంది, సోషల్ మీడియా సభ్యులు ర్యాలీని సమన్వయం చేస్తారు. అలాగే 40అంబులెన్సులు, 2500మంది వలంటీర్లు అందుబాటులో ఉంటారు. పరేడ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాక్టర్లను నిశితంగా పరిశీలిస్తారు. దిల్లీ బాహ్యవలయ రహదారిపై ర్యాలీని నిర్వహించనున్నారు.
దిల్లీలోకి ప్రవేశించే ఐదు మార్గాలైన సింఘూ, టిక్రి, ఘూజీపూర్, పల్వాల్, షాహజాన్పూర్ నుంచి మొదలయ్యే ఈ ర్యాలీ సాయంత్రం 6గంటలకు రాజ్‌పథ్ వద్ద ముగుస్తుందని రైతు సంఘాల నేతలు తెలిపారు.
రైతు శకటాలు..
ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా రైతులు శకటాలను ప్రదర్శించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు, గ్రామీణ జీవితం ప్రతిబింబించేలా ఈ శకటాలను రూపొందించనున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరో లక్ష ట్రాక్టర్లు ఆందోళనల్లో పాల్గొంటాయని.. వీటిలో కనీసం 30శాతం ట్రాక్టర్లు శకటాలను ప్రదర్శిస్తాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర, దేశంలో రైతు ఉద్యమాల చరిత్ర వంటివి ప్రదర్శించనున్నారు. మహరాష్ట్ర విదర్భకు చెందిన కొందరు పిల్లలు దిల్లీ సరిహద్దుల్లో రైతు ఆత్మహత్యలపై శకటాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. నీటి కొరతతో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలు సైతం ఈ ఆందోళనల్లో పాల్గొంటారు.
పోలీసు సిబ్బంది అప్రమత్తం..
ర్యాలీకి సంబంధించి శాంతి భద్రతల విషయంలో సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ పోలీసు విభాగం ప్రకటించింది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. ఇతర విధుల్లో ఉన్న సిబ్బంది .. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. సీఏపీఎఫ్ సహా ఇతర బలగాలు తయారుగా ఉండాలని సూచించింది. దిల్లీ పోలీసులతో శనివారం చర్చలు జరిపిన రైతు సంఘాల నేతలకు అధికారిక అనుమతి లభించింది.
ఇదీ చదవండి: గణతంత్ర వేడుకలు-భద్రతా వలయంలోకి దిల్లీ