మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు రైతు పోరాటం ఆగదని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు చేసిన ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పేర్కొంది.
ప్రస్తుత ఉద్యమ నిర్వహణ కోసం అన్ని సంఘాలతో కలిసి ఏర్పాటైన ఈ సంస్థ తరపున వ్యవస్థాగత కార్యదర్శి అవిక్ షాతో పాటు అశీష్ మిత్తల్, అతుల్ కుమార్ అంజాన్, అశోక్ ధావ్లే, హన్నన్ మొల్లా, కవితా కురుగంటి, కిరణ్ విస్సా, మేధా పాట్కర్, ప్రతిభా శిందే, రాజుషెట్టి, రాజారామ్ సింగ్, సత్యవాన్, సునీలం, వేములపల్లి వెంకటరామయ్య, యోగేంద్ర యాదవ్‌లు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
"గాజీపుర్ సరిహద్దులోని రైతు ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వీఎం సింగ్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం. దాంతో విభేదిస్తున్నాం. సమన్వయ సమితి ఆ ప్రకటనను ధ్రువీకరించడం లేదు. తమ వర్కింగ్ గ్రూప్ ప్రోటోకాల్స్‌కి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోలేదు. రైతు ఉద్యమాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. రైతులతో పక్షాన ఉండేందుకు ఏఐకేఎస్‌సీసీ కట్టుబడి ఉంది."
-ఏఐకేఎస్‌సీసీ ప్రకటన
కేంద్ర ప్రభుత్వంతో ఎవరైనా సమాంతరంగా చర్చలు జరిపితే అది రైతాంగ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినట్లనని ప్రకటనలో రైతు నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇదని వ్యాఖ్యానించారు. భారతీయ కిసాన్ యూనియన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరో ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: 'ఈ నెల 30న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు'