సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు తమ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను అర్థంలేనివిగా చెబుతున్నారు రైతులు. వాటిని ఇప్పటికే తిరస్కరించామని అంటున్నారు. సరైన ప్రతిపాదనతో ముందుకొస్తే చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. చట్టాలను పూర్తిగా రద్దుచేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా కురుస్తోంది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
పటిష్ఠ భద్రత
నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సింఘు, గాజిపుర్, టిక్రి సరిహద్దులో వందలాది సిబ్బంది మోహరించారు.
రహదారులను రైతులు దిగ్బంధించిన నేపథ్యంలో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నోయిడా, గాజియాబాద్ నుంచి దిల్లీకి చేరుకొనే రహదారులపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఆ మార్గంలో వచ్చే ప్రయాణికులు ఆనంద్ విహార్, డీఎన్డీ, అప్సరా, లోని, భోప్రా సరిహద్దు నుంచి రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.