వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్న వేళ.. హరియాణాకు చెందిన పలువురు రైతులు ఆసక్తికర ప్రకటన చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో భేటీ అయిన 29 మంది రైతులు.. సాగు చట్టాలకు మద్దతు ప్రకటించారు. చట్టాలను ఉపసంహరిస్తే నిరసన చేస్తామని హెచ్చరించారు.
భారతీయ కిసాన్ యూనియన్(మన్) హరియాణా లీడర్ గుని ప్రకాశ్ నేతృత్వంలోని రైతుల బృందం ఈ మేరకు మద్దతు ప్రకటిస్తూ.. మంత్రికి లేఖ సమర్పించింది. ఈ చట్టాలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
"ఈ చట్టాలను రద్దు చేస్తే మేం కూడా నిరసన ప్రారంభిస్తాం. అన్ని జిల్లాలకు మెమోరాండం పంపించాం. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. మేం ఈ మూడు చట్టాలకు మద్దతుగా ఉన్నాం. వామపక్షాలు, హింసను ప్రేరేపించేవారు తాజా నిరసనలను నడిపిస్తున్నారు" అని ప్రకాశ్ చెప్పుకొచ్చారు.
రాజకీయమయం
తాజా నిరసనలు ఎంతమాత్రం రైతులకు సంబంధించినది కాదని.. ఇప్పుడిది రాజకీయ రంగు పులుముకుందని ఆరోపించారు ప్రకాశ్. నూతన చట్టాల ద్వారా రైతులకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఇతర ప్రభుత్వాలు 2014 వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఇప్పటికే హరియాణాకు చెందిన కొంతమంది రైతుల బృందం ఈ చట్టాలకు మద్దతు ఇచ్చింది. డిసెంబర్ 7న తోమర్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించింది.