ఎట్టకేలకు నూతన వ్యవసాయ చట్టాలపై (Farm laws repeal) కేంద్రం వెనక్కి తగ్గింది. సాగు చట్టాల రద్దుపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు (Farm laws 2020) ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే.. గతేడాది నుంచి రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్ధృతంగా నిరసనలు చేస్తుండగా.. ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కసారిగా ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటి? అంటే దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల కేంద్రంగానే రైతులు సాగు చట్టాలపై (Farm laws latest news) పోరు సాగించారు.
పంజాబ్‌లో పాగా వేసేందుకేనా?
- పంజాబ్ రైతులు భారీ సంఖ్యలో గతేడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లోనే కాపుగాస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ తమకు వద్దని పట్టుబట్టి కూర్చున్నారు.
- పంజాబ్‌లో జాట్ల జనాభా ఎక్కువ. వ్యవసాయ చట్టాలను మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ వర్గమే. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.
ఇవి రానున్న ఎన్నికల్లో తమను దెబ్బతీసే ప్రమాదం ఉందని భావించి. ఎన్డీఏ వెనక్కి తగ్గిందని (Farm laws latest news) తెలుస్తోంది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామాతో పాలన పరంగా కొంత అనిశ్చితిలో చిక్కుకున్న ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఈ నిర్ణయం తమకు లాభిస్తుందని భావించి ఉండొచ్చు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మెజార్టీ ఉన్నా.. అదే భయం..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు ఎక్కువ. మోదీ సర్కార్‌పై ఉద్యమించిన రైతు సంఘాల నేతల్లో చాలా మందికి రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల్లో మంచి పట్టుంది.
- యూపీలో ఎన్డీఏనే భారీ మెజార్టీతో అధికారంలోనే ఉన్నప్పటికీ.. ఎన్నికలకు ముందు రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం ఎందుకని కేంద్రం ముందు జాగ్రత్త పడి ఉండవచ్చు.
రాకేశ్ టికాయిత్..
సాగు చట్టాల (Farm laws 2020) వ్యతిరేక ఉద్యమంలో మొదటినుంచి ప్రధానంగా వినిపించిన పేరు రాకేశ్ టికాయిత్. ఆయన ఒక్క పిలుపు అనేక మందిని ఏకం చేసింది. టికాయిత్ పోరాటం.. రైతుల ఉద్యమానికి ఊపిరి పోసింది. యూపీకే పరిమితమైన ఈ భారతీయ కిసాన్ సంఘం నేత పేరు.. దిల్లీలో నిరసనలతో(Farmers protest) దేశం మొత్తం మారుమోగింది.
రుణమాఫీ, కనీస మద్దతు ధర, విద్యుత్తు రుసుములు, భూసేకరణ వంటి అంశాలపై యూపీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఎన్నో ఉద్యమాలు నడిపిన ఆయన.. సాగు చట్టాల (Farm laws latest news) వ్యతిరేక పోరులో ఏనాడూ వెనక్కి తగ్గలేదు. దీనిని ఎన్నికల అంశంగా తీసుకెళ్దామని కూడా ఆయన భావించారు. తాజా ప్రకటనతో ఆయనకు కేంద్రం ఆ అవకాశం లేకుండా చేసిందనే వాదన వినిపిస్తోంది.
ఇదీ చూడండి: రైతు గుండె చప్పుడు- రాకేశ్ టికాయిత్!
ఈ నేపథ్యంలోనే యూపీ సహా పలు రాష్ట్రాల్లోని రైతులను ప్రభావితం చేయగల టికాయిత్‌ను చూసి కూడా కేంద్రం వెనుకడుగు వేసిందని చెప్పొచ్చు.
ఇవే కాక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ.. రైతు నిరసనలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్న అనుమానమే సాగు చట్టాల రద్దుకు మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది.
విపక్షాలు ఏకం..
కేంద్రం సాగు చట్టాలు(Farm laws 2020) తీసుకొచ్చిన దగ్గర నుంచి.. దేశవ్యాప్తంగా విపక్షాలు రైతులకు మద్దతు తెలిపాయి. ఆయా రాష్ట్ర అసెంబ్లీల్లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ(Farmers protest) తీర్మానాలు చేశాయి.
అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు జాతీయ పార్టీ కాంగ్రెస్ వద్ద ఉన్న కాస్త పెద్ద అస్త్రం ఏదైనా ఉందంటే సాగు చట్టాలే. వీటిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తరచూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రద్దు నిర్ణయంతో (Farm laws cancelled) ఇప్పుడు ఆ అవకాశం కాంగ్రెస్‌కు లేకుండా చేసింది మోదీ సర్కార్. ఇదో వ్యూహాత్మక అడుగుగా అభివర్ణించవచ్చు.
ఇదీ చూడండి: కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు