Falaknuma Express Fire Accident News : పశ్చిమ బెంగాల్‌లోని హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. వెంటనే ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. ఈ ఘటనలో రైలులోని ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అదే సమయంలో ఆ రైలులో ఉన్న ఓ యువకుడు మాత్రం తన ప్రాణాలను లెక్కచేయకుండా పలువురి ప్రాణాలు కాపాడాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఎంతో మంది ప్రాణాలను నిలిపాడు సిగిల్ల రాజు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారం పుర పరిధి లక్ష్మీనగర్‌లో కుటుంబీకులతో పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన ఈ విధంగా వివరించారు.
Shocking Facts about Falaknuma Express Accident : 'ఒడిశాలోని పర్లాకిమిడికి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కాం. నేను, మా అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఎస్4 బోగిలో కూర్చున్నాం. ఉదయం 11 గంటల సమయంలో నేను పై బెర్తులో పడుకొని ఉండగా రబ్బరు కాలినట్లు వాసన వచ్చింది. పై నుంచి వేడి వస్తుంది. ఎండకు ఉండొచ్చని భావిస్తున్న సమయంలోనే వాసన మరింత ఎక్కువైంది. కిందికి దిగి కిటికీలోంచి చూడగా పొగ వస్తోంది. వెంటనే కేకలు వేశాను. చైన్ లాగినా రైలు పరిగెడుతూనే ఉంది. రెండోసారి గట్టిగా లాగితే రైలు ఆగింది' అని రాజు తెలిపాడు.
అప్పటికే ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారని రాజు పేర్కొన్నాడు. ఆ సమయంలో అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం ఇచ్చానన్న ఆయన.. తమ కుటుంబ సభ్యులను కిందికి దించానన్నాడు. ఎందుకంటే ప్రమాద కేంద్రం తమ బెర్తు వద్దనే ఉందన్నాడు. తమ మూడు బ్యాగులు, నగదు, సామగ్రి దగ్ధమయ్యాయని చెప్పాడు. తోటి ప్రయాణికులు కిందకు దిగడానికి సహకరించానన్న సిగిల్ల రాజు... ఇదే సమయంలో పొగలు, మంటలు ఎక్కువయ్యాయని తెలిపాడు. పొగను ఎక్కువగా పీల్చడంతో తాను స్పృహతప్పి పడిపోయానన్నాడు. అక్కడికి వచ్చిన వారు మమ్మల్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారని వ్యాఖ్యానించారు.
'ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు స్పృహలోకి వచ్చాను. రాత్రి 11 గంటలకు ఐడీఏ బొల్లారంలోని ఇంటికి చేరుకున్నాను. ప్రమాదాన్ని ముందే గుర్తించి కేకలు వేయటం, రైలు చైన్ లాగటం, అది ఆగటం, హాహాకారాలు చేస్తూ ప్రయాణికులు కిందకు దిగటం కొన్ని నిముషాల వ్యవధిలో జరిగిపోయింది. ఐదారు నిమిషాలు ఆలస్యమైనా తీవ్ర నష్టం జరిగేది. పొగ ఎక్కువగా పీల్చడంతో చాలా నీరసంగా ఉంది. ఛాతిలో నొప్పి వస్తోంది. చికిత్స కోసం ఏ అధికారి పట్టించుకోవటం లేదు. ఆ రోజు ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నాను.' - సిగిల్ల రాజు
ఇవీ చదవండి :