Fake Toll Plaza In Gujarat : గుజరాత్‌లో మరోసారి నకిలీ వ్యవహారం బయటపడడం కలకలం రేపింది. మోర్బీ జిల్లాలో మోసగాళ్లు బైపాస్ రోడ్డు నిర్మించారు. మధ్యలో టోల్ ప్లాజ్ కట్టేశారు. ఆ తర్వాత ఏకంగా ఏడాదిన్నర పాటు వాహనదారుల నుంచి రూ. కోట్లు దండుకున్నారు.
వివరాలు ఇలా
మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయ రహదారిపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్ ప్లాజా నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు పక్కనే ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గంలో వెళ్తుండేవారు. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డును నిర్మించి ఫ్యాక్టరీలో టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
ఏడాదిన్నరగా నుంచి ఈ టోల్ ప్లాజాను మోసగాళ్లు నడిపిస్తున్నారట. హైవేపై ఉన్న టోల్ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేయడం వల్ల వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదట. దీనిపై ఇటీవల స్థానిక మీడియాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నకిలీ టోల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా పాటిదార్ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఈ నకిలీ టోల్ ప్లాజాతో నిందితులు వాహనదారుల నుంచి దాదాపు రూ.75కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం. అయితే దీని గురించి స్థానిక అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా, గుజరాత్‌లో ఇలా వ్యవహారం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల దాహోద్ జిల్లాలో ఓ నకిలీ ప్రభుత్వ ఆఫీసు గుట్టు బయటపడింది. దాన్ని ఛేదించగా జిల్లాలో అలాంటివి మరో ఆరు నకిలీ కార్యాలయాలున్నట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ప్రభుత్వ ఆఫీసులంటూ ప్రజలను నమ్మించి నిందుతులు గత కొన్నేళ్లుగా రూ.18కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహా పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
మళ్లీ ఉల్లి ధరకు రెక్కలు!- విదేశాలకు ఎగుమతులపై కేంద్రం బ్యాన్