Nude Video Call in Facebook: ఫేస్బుక్ స్నేహితుడు ఓ యువతిని నగ్నంగా వీడియోలో చిత్రీకరించి ఆమె పెళ్లి చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటపడడంతో వీడియో వైరల్ చేసిన వ్యక్తితోపాటు.. యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై, పెళ్లి పెద్దలపై కూడా కేసులు నమోదుకు కారణమైంది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు బయటపడ్డాయని కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్ పోలీసులు తెలిపారు.
గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి ఫేస్బుక్ ద్వారా కర్రా న్యూటన్బాబు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య చనువు పెరగడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో ఆ యువకుడు దానిని రికార్డు చేశాడు. ఈ క్రమంలో ఆ యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో పెళ్లి కుదిరింది. దీంతో యువతి తన కాబోయే భర్త అని అతనితో కూడా శారీరకంగా దగ్గరైంది. ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉండగా న్యూటన్ బాబు.. ఆ యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెండ్లి కొడుకు పరంజ్యోతికి పంపాడు. పరంజ్యోతి.. ఆ వీడియోను పెళ్లి కుదిర్చిన పెద్దలకు పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు.
ఈ క్రమంలో పెళ్లి పెద్ద గుర్రం జాషువాజ్యోతి ఆ వీడియోను యువతి కుటుంబ సభ్యులకు పంపి పెళ్లి కుదరదని తెలిపారు. అలాగే న్యూటన్ బాబు బంధువులు కొండ్రు రణధీర్, బాపట్ల కోటేశ్వరరావు సైతం ఆ నగ్న వీడియోను మరికొందరికి పంపారని పోలీసులు గుర్తించారు. వారందరిపై కేసులు నమోదు చేసిన సీఐ బి.తులసీధర్.. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలు సేకరించారు. యువతిని బెదిరించి నగ్న వీడియోను చిత్రీకరించిన న్యూటన్ బాబుపై అత్యాచార యత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు, జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్లపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు తరలించారు. ఎవరివైనా వ్యక్తిగత నగ్న వీడియోలను ఎవరికైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే వారికి జైలు శిక్ష తప్పదని సీఐ తులసీధర్ హెచ్చరించారు.
Son Killed Mother: అత్తాకోడళ్ల మధ్య నిత్యం వివాదం.. కొత్త ఇల్లు కట్టుకున్నా తొలగని తలనొప్పి.. తల్లి ఆ ఇంట్లో అడుగుపెడితే తాను ఉండబోనంటూ భార్య హెచ్చరిక.. ఇలాంటి తలపోట్ల మధ్య అతడిలో మానవత్వం నశించింది. నమమాసాలు మోసి పెంచిన తల్లిని.. అందులోనూ ఎనిమిది పదుల వయసున్న పండు ముదుసలిని నీటికుంటలో పడేసి అంతమొందించాడు. మానవత్వానికి మచ్చతెచ్చే ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో చోటుచేసుకుంది.
రేణింగవరం ఎసస్ఐ తిరుపతిరావు కథనం మేరకు.. రామకూరు గ్రామానికి చెందిన కె. సుబ్బులమ్మ (85), కుమారుడు శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అత్తా, కోడలు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. శ్రీనివాసరావు ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే అత్తగారు అడుగు పెడితే తాను ఆ ఇంట్లో ఉండనంటూ శ్రీనివాసరావు భార్య తెగేసి చెప్పింది. ఏం చేయాలో పాలుపోని కుమారుడు.. తల్లిని అడ్డుతొలగించుకునేందుకు సిద్ధపడ్డాడు. బుధవారం సాయంత్రం ఆమెను బండిపై ఎక్కించుకుని ఊరి చివర ఉన్న చిన్నమ్మకుంట దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరూ చూడలేదని నిర్ధారించుకున్నాక.. వృద్ధురాలైన తల్లిని అమాంతం నీళ్లలోకి నెట్టేసి ఏం ఎరగనట్లుగా ఇంటికొచ్చాడు. తెల్లవారిన తర్వాత పశువుల కాపర్లు ఆమె మృతదేహాన్ని కుంటలో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కుమారుడు శ్రీనివాసరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.