భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని దేశ ఆరోగ్య నిపుణులు పిలుపునిచ్చారు. దేశం నలుమూలలకు టీకాలు చేరాలని అభిప్రాయపడ్డారు.
కరోనా ఉద్ధృతి, వ్యాక్సినేషన్‌పై ఆరోగ్య నిపుణులు ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. అప్పట్లో.. కేసులు తక్కువగా నమోదైన ప్రాంతంలోనే ఇప్పుడు కరోనా ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏహెచ్‌సీపీ-ఇండియా(అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్).. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. టీకా పంపిణీలో వేగం పెంచాలని కోరింది.
"మార్చి 26న, ప్రధాని మోదీకి మేము లేఖ రాశాము. టీకా సరఫరాలో వేగం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధానికి తెలిపాము. కరోనా 2.0 వల్ల భారీ నష్టం కలిగే ప్రమాదం ఉంది. ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే.. రోజుకు 2కోట్ల టీకాలను పంపిణీ చేయవచ్చు."
--- డా. గిరిధర్ జ్ఞాని, ఏహెచ్సీపీఐ డైరక్టర్ జనరల్.
దేశంలోని ప్రైవేటు ఆరోగ్య రంగానికి ఏహెచ్సీపీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది.
దేశంలో.. 30-100 పడకల సామర్థ్యంతో 25వేల ప్రైవేటు ఆసుపత్రులు, 30 పడకల సామర్థ్యంతో 40వేల ఆసుపత్రులు, 100కుపైగా పడకల సామర్థ్యంతో 3వేల ఆసుపత్రులు ఉన్నట్టు జ్ఞాని తెలిపారు.
ఇదీ చూడండి:- కొవిడ్ పంజా: దేశంలో మరో 81,466 కేసులు