బంగాల్‌లో 8 విడతల్లో జరిగిన శాసనసభ ఎన్నికల కోసం సాగిన సుదీర్ఘ ప్రచారం వల్ల.. కరోనా విషయంలో ఆ రాష్ట్రం భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి శనివారం వరకు బంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 48 రెట్లు పెరిగింది. ఫిబ్రవరి 26న బంగాల్‌లో యాక్టివ్ కేసులు కేవలం 3,343 ఉండగా, శనివారం ఆ సంఖ్య లక్ష 32వేలు నమోదైంది. కోల్‌కతా మినహా బంగాల్‌లోని మిగతా ప్రాంతాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న కోల్‌కతా మినహా మిగతా ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 183 ఉండగా, శనివారం ఆ సంఖ్య లక్షా ఆరు వేలుగా నమోదైంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలంతా ఒక్క చోట భారీగా చేరడమే దీనికి కారణం అని అనేక మంది వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికలను శాస్త్రీయంగా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పారా మిలటరీ దళాలు రావడం కూడా బంగాల్‌లో కేసుల పెరుగుదలకు కారణమైందని అన్నారు.
ఇదీ చదవండి:కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్ టంగ్'