దేశ రాజధాని దిల్లీలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత దిల్లీలో తొలిసారి శుక్రవారం రోజువారీ కేసులు 10వేల లోపే నమోదయ్యాయి. తాజాగా 6500కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న 7,897 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ప్రతి నిత్యం పది వేలకు పైగా రోజువారీ కేసులు వెలుగులోకి వచ్చాయి.
లాక్‌డౌన్ వల్లే..
కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడానికి లాక్‌డౌన్ ప్రధాన కారణం అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య 6500అనేది ఇంకా చాలా పెద్ద సంఖ్యే అన్న వైద్య నిపుణులు... ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికి రాదని దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య నిపుణులు హెచ్చరించారు.
పాజిటివిటీ రేటు 11 శాతం లోపు..
దిల్లీలో కేసుల తగ్గుదలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న 28వేలుగా ఉన్న రోజువారీ కేసులు, శనివారం 6,500మాత్రమే నమోదయ్యాయని అన్నారు. పాజిటివిటీ రేటు 11 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని చెప్పారు. పదిహేను రోజుల్లోనే వెయ్యి ఐసీయూ పడకలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనికి ప్రధాన కారణమైన వైద్యులు, ఇంజినీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కాన్సంట్రేటర్ల బ్యాంకు
మరోవైపు, నెల క్రితం ఆక్సిజన్ కొరతతో అల్లాడిన దిల్లీ ప్రస్తుతం.. ఆ సంక్షోభం నుంచి దాదాపుగా గట్టెక్కింది. తాజాగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. కొవిడ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు వీటిని నెలకొల్పినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి జిల్లాలో 200 కాన్సంట్రేటర్లతో బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు అవసరాన్ని ఇంటి వద్దకే వీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అనాథలైన చిన్నారులకు అండగా ప్రభుత్వం: సీఎం