విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే వారికి పరీక్షలపై భయం చాలా వరకు తగ్గిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న వేళ విద్యార్థుల్లో ఆందోళనను తగ్గించి ధైర్యం నింపడంలో భాగంగా నిర్వహించిన 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో ఆయన ముచ్చటించారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. తొలుత ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎన్.పల్లవి పరీక్షల సమయం దగ్గరికి వచ్చే సమయంలో తలెత్తే ఆందోళనలను ఎలా తొలగించుకోవాలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, మిత్రులు ఒత్తిడి చేయడం మానేస్తే పరీక్షలు చాలా సులభతరమవుతాయన్నారు. జీవితంలో ఎన్నో దశలు ఉంటాయని, పరీక్షలూ అందులో భాగమేనన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే..
విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తను వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోను, ఇప్పుడు కూడా కష్టమైన అంశాలను ఎదుర్కోవడంతోనే రోజుని ప్రారంభించడమంటే తనకెంతో ఇష్టమన్నారు.
'నేనెప్పుడూ కఠినమైన పనులనే ముందు ఎంచుకుంటాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి దీన్నో అలవాటుగా మార్చుకున్నా. ఇప్పుడది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఉదయం లేవగానే.. కష్టమైన పనులతోనే రోజు ప్రారంభిస్తాను. అధికారులు కూడా చాలా కఠినమైన అంశాలతో నా వద్దకు వస్తుంటారు. కష్టమైన పనులతో రోజును ప్రారంభించడమంటే నాకు ఇష్టమని వాళ్లకు కూడా తెలుసు. అంతేకాదు, వాటిని మనం సులభంగా పరిష్కరించవచ్చు' అని అన్నారు.
లతా మంగేష్కర్ పేరు ప్రస్తావన
అందరూ అన్ని సబ్జెక్టుల్లో రాణించలేరని ప్రధాని అన్నారు. 'లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌కు భౌగోళిక శాస్త్రంలో అంత ప్రావీణ్యత లేకపోవచ్చు.. కానీ గాయనిగా ఆమె అసమానురాలు. మీకు కూడా కొన్ని సబ్జెక్టులు కష్టమనిపించొచ్చు. అంత మాత్రాన అదేమీ ఓటమికాదు. కఠిన సబ్జెక్టుల నుంచి పారిపోవద్దు' అని సూచించారు.
వాటిని ఓ జాబితాగా రాసుకోండి..
"జీవితంలో మీకు ఏయే అంశాలు కష్టమనిపించాయో, ఏవి సులువుగా అనిపించాయో ఓ జాబితా సిద్ధం చేసుకోండి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం మొదట్లో కష్టం అనిపించినా ఇప్పుడవి ఎంతో సులభం. జీవితంలో మీకెదురైన ఇలాంటి అంశాలను ఓ పేపర్‌పై రాసి పెట్టుకోండి. అలాగైతే, మీరు కొన్ని విషయాలు కష్టమైనవి అనే ప్రశ్న ఎప్పుడూ అడగరు" అని మోదీ సూచించారు. పిల్లల మెదళ్లలో భయాందోళనలు రేకెత్తించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు 14లక్షల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే హైడ్రామా.. బట్టలు చించుకొని ఆందోళన