కరోనాతో విధించిన లాక్డౌన్ వల్ల చదువులకు దూరమైన ఝార్ఖండ్ తూర్పు సింహభూమ్ జిల్లాకు చెందిన ముగ్గురు పిల్లలకు ఎమ్మెల్యే రాందాస్ సోరెన్.. ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేశారు. ముసాబని బ్లాక్‌లోని రోమ్ గ్రామానికి చెందిన ఆ పిల్లలు.. ఆన్‌లైన్ చదువుల కోసం ఫోన్లు కొనుగోలు చేయలనే ఉద్దేశంతో ముసాబని-జడుగోడ మెయిన్ రోడ్డు పక్కన మామిడిపళ్లు విక్రయిస్తున్నారు. వీరిపై ఈటీవీ భారత్ కథనానికి ఘాటిశీల నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ అనూహ్యంగా స్పందించారు.
ఫోన్లు కొనేందుకు పళ్లు అమ్మకం
సోరెన్ తన పార్టీ కార్యకర్తలను ఆ గ్రామానికి పంపించి.. ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. లాక్డౌన్ కారణంగా పాఠశాల మూసివేశారని, పిల్లలందరూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే కూలీ పని చేసుకుని బతికే తమకు ఆండ్రాయిడ్ ఫోన్లు కొనే స్తోమత లేదని చెప్పుకొచ్చారు. పిల్లలకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉందని.. ఫోన్లు కొనేందుకు కావాల్సిన డబ్బు సంపాందించడానికి రోడ్డుపక్కన మామిడి పళ్లు అమ్ముతున్నారని తెలిపారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు.. ఈ వివరాలన్నీ రాందాస్ ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన రాందాస్.. వారికి ఆండ్రాయిడ్ ఫోన్లు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలను తన నివాసానికి పిలిపించి.. ఫోన్లు అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఆన్‌లైన్ తరగతలకు హాజరవుతామని చెప్పారు. చిన్నారులకు ఫోన్లు అందజేసినందుకు వారి తల్లిదండ్రులు.. ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, తన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'!