గుజరాత్ ఎన్నికల్లో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీదేనని ఆ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక గుజరాత్లో విద్యుత్ కోతలను పూర్తిగా రూపుమాపుతామని చెప్పారు. కాంగ్రెస్కు వేసే ఓటు వృథా అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు వేసిన ఓటు చెత్తబుట్టలోకి వెళ్లినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈటీవీ భారత్తో అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వీ ప్రత్యేకంగా మాట్లాడారు.
గుజరాతీలంతా తమను ఆసక్తిగా చూస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ద్రవ్యోల్బణ సమస్యను అంతం చేస్తామన్న తొలి పార్టీ తమదేనని చెప్పారు. గుజరాత్లో అధికారంలోకి వస్తే ప్రతి నెల 20-25 తేదీల మధ్యే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. ఆప్ అధికారంలోకి వస్తే మెజార్టీ ప్రజలకు విద్యుత్ బిల్లలనేవే ఉండవని అన్నారు. దిల్లీ, పంజాబ్లో చేసినట్టుగానే కరెంటు కోతలను రూపుమాపుతామని చెప్పారు. 'గుజరాత్లో అద్భుతమైన విద్యా సంస్థలను నెలకొల్పుతాం. గతంలో ఏ పార్టీ ఇలాంటి హామీలు ఇవ్వలేదు. అత్యద్భుతమైన ఆస్పత్రులను నిర్మిస్తాం. బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా వైద్యం అందిస్తాం. ఏ రాజకీయ నాయకులైనా వీటి గురించి మాట్లాడుతున్నారా?' అని పేర్కొన్నారు. గుజరాత్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారని ప్రశ్నించగా.. అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్లోని అన్ని ప్రాంతాల నుంచి ఓట్లు దక్కించుకుంటామని చెప్పారు. పాత పింఛను పద్ధతిని తిరిగి తీసుకొస్తామన్నారు.
భాజపాను నమ్మడం లేదు: గఢ్వీ
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భాజపా గతంలో హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఇది నెరవేరలేదని ఈశుదాన్ వ్యాఖ్యానించారు. ఆదాయం పెరగకపోగా.. ఖర్చులు మాత్రం రెట్టింపు అయ్యాయని అన్నారు. '53 లక్షల మంది రైతులకు సరైన గిట్టుబాటు రావడం లేదు. విద్యుత్, నీటి పారుదల సదుపాయాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుంది. మరోవైపు, 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ప్రతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవుతోంది. భాజపాను యువత నమ్మడం లేదు' అని ఈశుదాన్ పేర్కొన్నారు.