ESIC Notification 2023 : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వైద్య సేవలందించే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో పనిచేయాలనుకునే వారికి ఆ సంస్థ తీపి కబురు అందించింది. అందులో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి భర్తీకి ఎలాంటి పరీక్ష లేకపోవడం గమనార్హం. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈఎస్ఐలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 141 పోస్టులున్నాయి. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్, ఆర్మీ మెడికల్ టీచర్ (రిటైర్డ్ ) పోస్టులు ఉన్నాయి. వీటిని ఒప్పంద (కాంట్రాక్ట్) పద్ధతిలో తీసుకుంటామని సంస్థ వివరించింది. వయో పరిమితి 45 నుంచి 69 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 2,22,543 ఇవ్వనుంది. ఉద్యోగ అర్హతలు, అనుభవం వంటి వివరాలు అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు.
ఎంపిక ఇలా..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూలను హైదరాబాద్ సనత్ నగర్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్లో మే 29 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. హాజరయ్యే అభ్యర్థులు పాస్పోర్టు సైజు ఫొటోలు రెండు, విద్యార్హతలు, వయసు నిర్ధరించే జనన ధ్రువీకరణ పత్రం, ఎక్స్పీరియన్స్ ధ్రువపత్రాల కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న పత్రాలను తీసుకురాని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించరు. అభ్యర్థుల ఎంపిక తుది నిర్ణయం సెలక్షన్ బోర్డుదే. ముఖాముఖికి హాజరయ్యే వారికి రవాణా ఖర్చులు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. తుది ఫలితాలు సంబంధిత అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు.
NPCIL లో ఉద్యోగాలు..:
ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు విభాగాల్లో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో మానవ వనరలు (హెచ్ఆర్), లీగల్, ఎఫ్ అండ్ ఏ, ఎంఎం విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ పోస్టులున్నాయి. దీంతో పాటు హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులనూ భర్తీ చేయనుంది. అయితే పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి.
అర్హతలు :
అన్ని పోస్టులకు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ. 50 వేల నుంచి రూ.79 వేల వరకు ఉంటుంది. విద్యార్హతల విషయానికొస్తే.. పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, సంబంధిత విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ మే 29 తో ముగుస్తుంది. ఫీజు పోస్టును బట్టి రూ.150 నుంచి రూ.500 మధ్య ఉంది.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ముఖాముఖి ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూ నిర్వహించిన కమిటీదే.