ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారానికి ఎక్కడికి పిలిచినా వెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న నాయకులు (జీ-23) తరపున ఆయన మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఐదు రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీలోని నా సహచరుల తరపున నేను ఈ విషయం స్పష్టం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ గెలుపునే మేం కోరుకుంటున్నాం. రాబోయే రెండునెలల్లో ఇదే మా లక్ష్యం' అని ఆజాద్ తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న ఆజాద్ తాజాగా ఓ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై పలు విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తాను ప్రధానిని ఒక సందర్భం కారణంగానే ప్రశంసించానని ఆయన వెల్లడించారు. అంతకుముందు పార్లమెంటులో గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సందర్భంగా ఆయన గురించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి: 'ఆ లక్ష్యాలను గడువు కంటే ముందే సాధిస్తాం'